నేడు అంబేడ్కర్‌ కాలేజీకి సీఎం రేవంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

నేడు అంబేడ్కర్‌ కాలేజీకి సీఎం రేవంత్‌రెడ్డి

Published Fri, Dec 22 2023 4:34 AM

- - Sakshi

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బాగ్‌లింగంపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విద్యా సంస్థల వార్షికోత్సవం, అంబేడ్కర్‌ లా కాలేజీ గ్రాడ్యుయేషన్‌కు శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు పి.విష్ణువర్ధన్‌రెడ్డి, ఓయూ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర జుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ ఎం.రాజేందర్‌, అంబేడ్కర్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ జి.వివేక్‌ వెంకటస్వామి, సెక్రటరీ డాక్టర్‌ జి.వినోద్‌, కరస్పాండెంట్‌ డాక్టర్‌ జి.సరోజావివేక్‌, జాయింట్‌ సెక్రటరీ పి.వి.రమణకుమార్‌ పాల్గొననున్నారు.

నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

రాష్ట్రపతి ఎట్‌ హోమ్‌, క్రిస్మిస్‌ వేడుకల నేపథ్యంలో

సాక్షి, సిటీబ్యూరో: బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న ఎట్‌ హోమ్‌ కార్యక్రమం, ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న క్రిస్మస్‌ వేడుకల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో శుక్రవారం ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉండనున్నాయి. సాధారణ వాహన చోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని పోలీసు అధికారులు సూచించారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల మధ్య లోతుకుంట–జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మధ్య ఉన్న ప్రాంతాల్లో, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎల్బీ స్టేడియం కేంద్రంగా ఆంక్షలు అమలు కానున్నాయి. ఆయా చోట్ల అవసరాన్ని బట్టి వాహనాలను పూర్తిగా ఆపేయడమో, దారి మళ్లించడమో చేయనున్నారు.

బొటానికల్‌ గార్డెన్‌కు బ్యాటరీ వాహనాల అందజేత

గచ్చిబౌలి: బొటానికల్‌ గార్డెన్‌లో 1,600 రకాల జాతుల మొక్కలు ఉన్నాయని, మరో 400 రకాల జాతి మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీఎస్‌ఎఫ్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. గురువారం కొత్తగూడలోని బొటానికల్‌ గార్డెన్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ జోన్‌ సీజీఎం భాస్కర్‌ రావు రెండు గోల్ఫ్‌ కార్ట్‌ బ్యాటరీ వాహనాలను ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొటానికల్‌ గార్డెన్‌లో 1600 రకాల మొక్కలు ఉన్నాయని, పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వృక్ష పరిచయం చేసేందుకు గోల్ఫ్‌ కార్ట్‌ బ్యాటరీ వాహనాలు అవసరమన్నారు. కాక్టస్‌ గార్డెన్‌, హెర్బల్‌ మెడిసినల్‌ గార్డెన్‌, క్లింబర్స్‌, క్రీపర్స్‌, నక్షత్ర వనం, నవగ్రహ వనం, రాసి వనం, మ్యూజికల్‌ ట్రీ గార్డెన్‌, బటర్‌ఫ్లై గార్డెన్‌, కీటక ఆహార వనాలను చూసేందుకు నిత్యం వెయ్యి మందికి పైగా సందర్శకులు వస్తారని పేర్కొన్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీజీఎం శ్రీనివాస్‌ రావు, సీనియర్‌ మేనేజర్‌ శివ కుమార్‌, సుమలత, టీఎస్‌ఎఫ్‌డీసీ డైరెక్టర్‌ అక్బర్‌, జీఎం స్కైలాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement