డ్రగ్‌ పెడ్లర్‌గా మారి..! | Sakshi
Sakshi News home page

డ్రగ్‌ పెడ్లర్‌గా మారి..!

Published Mon, Jan 1 2024 5:12 AM

పోలీసుల అదుపులో నిందితులు - Sakshi

లోన్‌యాప్స్‌ దెబ్బకు

సాక్షి, సిటీబ్యూరో: వివిధ రకాలైన లోన్‌యాప్స్‌ నుంచి రుణాలు తీసుకుని రోడ్డున పడిన వారిని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారినీ ఇప్పటి వరకు చూశాం. అయితే పుప్పాలగూడకు చెందిన సురే లీలా నవీన్‌ సాయి కథ వేరు. మాదకద్రవ్యాలకు బానిసైన ఇతడు లోన్‌ యాప్స్‌ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక డ్రగ్‌ పెడ్లర్‌గా మారాడు. తన స్నేహితుడు బోర్రా వీర సాయి తేజతో కలిసి విక్రయానికి ప్రయత్నిస్తూ పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌కు చిక్కినట్లు డీసీపీ శ్రీబాల బల్లవరపు ఆదివారం వెల్లడించారు.

పంజాబ్‌లో చదువుతుండగా అలవాటు...

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మరిస్పేట్‌కు చెందిన నవీన్‌ సాయి 2019 వరకు పంజాబ్‌లోని ఒక యూనివర్శిటీలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివాడు. అప్పట్లో స్నేహితులు, రూమ్మేట్స్‌ ద్వారా మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. ఈ జల్సా ఖర్చుల కోసం మనీ వ్యూ, జస్ట్‌ మనీ, ధనీ, ట్రూ బ్యాలెన్స్‌, పేటీఎం పోస్టు పెయిడ్‌, క్రెడిట్‌ బీ, ఎం–పాకెట్‌ బ్రాంచ్‌ తదితర లోన్‌ యాప్స్‌ను ఇన్‌స్టల్‌ చేసుకుని అందినకాడికి రుణంగా తీసుకున్నాడు. చదువు పూర్తయ్యే వరకు, ఆపై స్వస్థలానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో వీటి నిర్వాహకుల నుంచి తీవ్ర ఒత్తిడి, బెదిరింపులు ఎదురయ్యాయి.

తోటి ‘వినియోగదారుడి’తో కలిసి దందా...

ప్రస్తుతం నవీన్‌ సాయి ఉద్యోగాన్వేషణలో భాగంగా నగరానికి వచ్చి పుప్పాలగూడలో నివసిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోన ఒంగోలుకు చెందిన సాయి తేజ కూడా పుప్పాలగూడలోనే ఉంటే సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల వ్యాపారం చేస్తున్నాడు. ఒకే ప్రాంతంలో నివసిస్తున్న నేపథ్యంలో నవీన్‌ సాయి, సాయి తేజ మధ్య పరిచయం ఏర్పడింది. సాయి తేజకు కూడా డ్రగ్స్‌ అలవాటు ఉండటంతో తరచు ఇద్దరూ కలిసి వినియోగిస్తుండే వారు. నవీన్‌ తమకు వచ్చిన డ్రగ్స్‌ దందా ఆలోచనను తేజకు చెప్పడంతో అతడు అంగీకరించాడు. ఇక్కడ విక్రయాల కోసం తమకు రెగ్యులర్‌కు విక్రయించే ఢిల్లీ పెడ్లర్‌ నుంచే ఖరీదు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ద్వయం బస్సులు, రైళ్లల్లో ఢిల్లీ వెళ్లి అక్కడి పెడ్లర్‌ నుంచి తక్కువ రేటుకు డ్రగ్‌ ఖరీదు చేసుకుని తీసుకువచ్చి ఇక్కడి కస్టమర్లకు ఎక్కువ ధరకు విక్రయించే వాళ్ళు.

‘డిసెంబర్‌ 31’ నేపథ్యంలో భారీగా...

న్యూ ఇయర్‌ పార్టీల నేపథ్యంలో డ్రగ్స్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడిందని గుర్తించిన వీళ్ళు ఇటీవల అక్కడకు వెళ్ళి 100 గ్రాముల ఎండీఎంఏ, 11.6 గ్రాముల బ్రౌన్‌షుగర్‌, 2 గ్రాముల కొకై న్‌ ఖరీదు చేసుకుని తీసుకువచ్చారు. గ్రాము రూ.2 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున కొన్న వీటిని సిటీలోని వినియోగదారులకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు, రూ.17 వేలు, రూ.10 వేలకు విక్రయించే ప్రయత్నం చేశారు. దీనిపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ ఖలీల్‌ పాషా, ఎస్సై ఎన్‌.రంజిత్‌ కుమార్‌లతో కూడిన బృందం ఆదివారం జూబ్లీహిల్స్‌లో ఇరువురినీ పట్టుకుంది. వీరి నుంచి సరుకు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించింది. పరారీలో ఉన్న ఢిల్లీ పెడ్లర్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

స్నేహితుడితో కలిసి దందా ప్రారంభించిన నిరుద్యోగి

ఢిల్లీ నుంచి తీసుకువచ్చి నగరంలో విక్రయాలు

న్యూ ఇయర్‌ పార్టీల నేపథ్యంలో భారీగా ఖరీదు

ఇరువురినీ అరెస్టు చేసిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

Advertisement
Advertisement