ఎల్‌ఈడీ లైట్లే కొంప ముంచాయా? | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీ లైట్లే కొంప ముంచాయా?

Published Thu, Jan 4 2024 9:34 AM

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న జీహెచ్‌ఎంసీ ఆధికారులు  - Sakshi

ఉప్పల్‌: ఉప్పల్‌ సీఎంఆర్‌ వస్త్ర దుకాణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి ఎల్‌ఈడీ లైట్లే కారణమని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఎలివేషన్‌ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాల కారణంగా షార్ట్‌ సర్యూట్‌ జరిగి మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై సీఎంఆర్‌ మేనేజర్‌ గౌతమ్‌ ఫిర్యాదు మేరకు ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అనుమతులపై అన్నీ అనుమానాలే..?
సీఎంఆర్‌ దుకాణం ఏర్పాటు చేసిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేదు అయినా వస్త్ర దుకాణం నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పని చేసే చోట భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకుండా, ఆక్యుపెన్సీ(ఓసి) లేకుండా అనుమతులు ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు.

ప్రమాదం నేపథ్యంలో బుధవారం జీహెచ్‌ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనల మేరకే వ్యాపార సంస్థకు అనుమతులు ఇచ్చారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వీటితో పాటు ట్రాఫిక్‌ విషయంలో సంబంధిత అధికారులు అనుమతి ఉందా? ఫైర్‌ ఎన్‌ఓసీ తదితర అంశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు బుధవారం ఉదయం అనుమతులపై ఆరా తీశారు. నిర్వాహకులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తమే కానీ సర్టిఫికెట్‌ మంజూరు చేయలేదని టౌన్‌ప్లానింగ్‌ అధికారి స్వయంగా పేర్కొనడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement