Telangana Political News: సిటీ ట్రాఫిక్‌.. ఓ జీవనది
Sakshi News home page

సిటీ ట్రాఫిక్‌.. ఓ జీవనది

Published Fri, Jan 12 2024 6:06 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్‌ అనేది ఒక జీవనది అని, పరిస్థితులను బట్టి పెరగడం–తగ్గడం ఉంటాయి తప్ప.. ఆగడం, లేకపోవడం అనేది జరగదని నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. దీని నిర్వహణలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నగర ట్రాఫిక్‌ విభాగంలో వలంటీర్లుగా (ట్రాఫిక్‌ ఫరిస్టే) పని చేస్తున్న వారిని హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ (హెచ్‌సీఎస్‌సీ) గురువారం సన్మానించింది. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి హెచ్‌సీఎస్‌సీ చైర్మన్‌గా ఉన్న కొత్వాల్‌ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిల్‌ పోలీసులకు విరాళంగా ఇచ్చిన అంబులెన్స్‌ను ప్రారంభించడంతో పాటు ఫ్రీ లెఫ్ట్‌ సైనేజ్‌ బోర్డులను ఆయన ఆవిష్కరించారు.

అనివార్య కారణాలతో..
సాధారణంగా ప్రతి మెట్రో నగరంలోనూ ట్రాఫిక్‌ సమస్యలు ఉంటాయని, అనివార్య కారణాల వల్ల సిటీలో ఇవి కొద్దిగా ఎక్కువని కొత్వాల్‌ అన్నారు. అన్ని చోట్లా సమాన వెడల్పులో ఉన్న రోడ్లు లేకపోవడం, రహదారులకు మధ్యలో ప్రార్థనా స్థలాలు ఉండటంతో పాటు రద్దీ ప్రాంతాల్లోకీ అన్ని వేళల్లో, అన్ని రకాల వాహనాలను అనుమతించడం, ఆక్రమణలు ప్రధాన కారణాలని అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక అలవెన్స్‌ సహా అనేక రకాలుగా ప్రభుత్వ ఆదుకోవడంతో సంక్షేమం విషయంలో ముందున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అన్ని వ్యవస్థలు కలిసి పని చేయాలని, కేవలం ట్రాఫిక్‌ పోలీసులనే బాధ్యులుగా చూస్తారని సీపీ వ్యాఖ్యానించారు. ఉల్లంఘనులకు జరిమానా విధింపు అనేది అసలైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కాదని, వాహనాలు నియంత్రణే దీని కిందికి వస్తుందని స్పష్టం చేసిన శ్రీనివాసరెడ్డి రద్దీ వేళల్లో చలాన్లు విధించవద్దని అధికారులను ఆదేశించారు.

కొన్ని కీలక చర్యలపై లోతుగా అధ్యయనం...
పీక్‌ అవర్స్‌లో అదనపు సీపీ నుంచి ప్రతి అధికారి కచ్చితంగా రోడ్డుపై ఉండి, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని సీపీ పునరుద్ఘాటించారు. ట్రాఫిక్‌ అంశంలో పాఠశాల స్థాయి నుంచి 2 వరకు చదువుతున్న వారిని భాగస్వాముల్ని చేయడం, ట్రాఫిక్‌ క్విజ్‌ల నిర్వహణ, ఎంపిక చేసిన రోడ్ల పైకి రద్దీ వేళల్లో వేగంగా నడిచే వాహనాల నియంత్రణ, ఆటోలపై సమగ్ర విధానం, తేలికపాటి వాహనాలకు సంబంధించి ‘సరి–బేసి’ విధానం అమలు, కార్‌ పూలింగ్‌ను ప్రోత్సహించడం సహా మరికొన్ని కీలక చర్యలపై అధ్యయనం చేస్తున్నామని కొత్వాల్‌ శ్రీనివాసరెడ్డి వివరించారు. ట్రాఫిక్‌ విభాగంలో పని చేసే వాళ్లు అన్‌సంగ్‌ హీరోలు కాదని, వారి పనిని గుర్తించి, ఆ మేరకు ఫలితాన్ని అందిస్తామన్నారు.

ట్రాఫిక్‌ నిర్వహణలో అవగాహనకే పెద్దపీట...
ప్రస్తుతం నగర ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించడానికి దాదాపు 80 మంది ఫరిస్టేలు ఉన్నారని, ఈ సంఖ్యలో తొలి దశలో 310కి పెంచడమే లక్ష్యమని ట్రాఫిక్‌ చీఫ్‌ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు.

ఈ బాధ్యతలను స్థానిక ఇన్‌స్పెక్టర్లకు ఆ బాధ్యతలు ఇస్తూ ఠాణాల్లో అప్లికేషన్లు అందుబాటులో ఉంచుతామని, ఔత్సాహికులు ముందుకు వచ్చి వలంటీర్లుగా చేరాలని కోరారు. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులని ఆయన వివరించారు. ట్రాఫిక్‌ నిర్వహణలో 80 శాతం అవగాహన (ఎడ్యుకేషన్‌), 20 శాతం చలాన్ల విధింపు (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) పాత్రలు ఉంటాయని విశ్వప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement