నేటి నుంచి ప్రగతి మహా విద్యాలయ స్వర్ణోత్సవాలు. | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రగతి మహా విద్యాలయ స్వర్ణోత్సవాలు.

Published Thu, Jan 18 2024 5:56 AM

క్యూరేటర్‌కు రూ.3 లక్షల చెక్కును అందజేస్తున్న ఆరిజీన్‌ ప్రతినిధులు  - Sakshi

సుల్తాన్‌బజార్‌: ప్రగతి మహా విద్యాలయ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాలు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నట్లు కళాశాల చీఫ్‌ ప్యాట్రన్‌ మహేష్‌ ఎస్‌ పటేల్‌, చైర్మన్‌ గోవింద్‌ దాస్‌ షా, కో చైర్మన్‌ గోపాల్‌ పటేల్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం హనుమాన్‌ టేక్డీలోని ప్రగతి మహా విద్యాలయ కళాశాలలో స్వర్ణోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 1973లో కేవలం 43 మందితో కళాశాల ప్రారంభమైందని, ప్రస్తుతం 2500 మంది విద్యార్థులతో కొనసాగుతుందన్నారు. ఈ కళాశాలలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పూర్వ విద్యార్థులేనన్నారు. సమావేశంలో అంబాలాల్‌ పటేల్‌, రాహుల్‌, భారతిడేన్‌ పటేల్‌, వైకేఎం.నాయుడు, డాక్టర్‌ ఎ.మాధవిలత, అమృత్‌సింగ్‌, టీసీ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆఫ్రికన్‌ లయన్‌ దత్తతకు ‘ఆరిజీన్‌’ సుముఖత

బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్‌ పార్కును బుధవారం బొల్లారానికి చెందిన ఆరిజీన్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా జూపార్కులోని ఆఫ్రియన్‌ లయన్‌ (మనోహర్‌)ను సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. దత్తతకు సంబంధించిన రూ.3 లక్షల చెక్కును జూపార్కు క్యూరేటర్‌ డాక్టర్‌ సునీల్‌ ఎస్‌ హిరేమత్‌కు అందజేశారు. అనంతరం క్యూరేటర్‌ హిరేమత్‌ మాట్లాడుతూ. వన్యప్రాణుల దత్తతకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆరిజీన్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు అశుతోష్‌ అనీల్‌ కొత్వాల్‌, ఎన్‌.దీపక్‌, సత్యనారాయణ్‌ గిరి తదితరులు పాల్గొన్నారు.

యోగా సర్టిఫికెట్‌ కోర్సుకు విశేష స్పందన

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్యా కేంద్రంలో ప్రారంభించిన ఆరు నెలల యోగా సర్టిఫికెట్‌ కోర్సుకు విశేష స్పందన లభించిందని డైరెక్టర్‌ ప్రొ.జీబీ రెడ్డి తెలిపారు. గత ఏడాది ప్రవేశపెట్టిన యోగా కోర్సులో 35 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు పేర్కొన్నారు. నిష్ణాతులైన యోగా గురువులతో సాధన, బోధన కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ఓయూ దూరవిద్యలో 2023–24 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో రెండో విడత ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు డైరెక్టర్‌ పేర్కొన్నారు.

టెస్ట్‌ మ్యాచ్‌కు గట్టి భద్రత: రాచకొండ సీపీ సుధీర్‌ బాబు

ఉప్పల్‌: ఈ నెల 25 నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఉప్పల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న టెస్ట్‌ మ్యాచ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు చెప్పారు. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో సుధీర్‌బాబు క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టేడియంలో లోపల, బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్‌లో టికెట్లు విక్రయించే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. స్టేడియంలో విక్రయించే తిను బండారాలు, శీతల పానీయాల ధరలు నిబంధనల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రావు, ఉపాద్యక్షుడు దల్జీత్‌ సింగ్‌, కార్యదర్శి దేవరాజు, మల్కాజిగిరి డీసీపీ పద్మజ పాల్గొన్నారు.

గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న సీపీ సుధీర్‌ బాబు తదితరులు
1/3

గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న సీపీ సుధీర్‌ బాబు తదితరులు

బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కళాశాల ఉన్నతాధికారులు
2/3

బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కళాశాల ఉన్నతాధికారులు

యోగా తొలిబ్యాచ్‌ విద్యార్థులతో డైరెక్టర్‌ ప్రొ.జీబీ రెడ్డి తదితరులు
3/3

యోగా తొలిబ్యాచ్‌ విద్యార్థులతో డైరెక్టర్‌ ప్రొ.జీబీ రెడ్డి తదితరులు

Advertisement
Advertisement