నిమ్స్‌ ఆస్పత్రి భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ ఆస్పత్రి భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

Published Mon, Jan 29 2024 6:02 AM

-

పంజగుట్ట/లక్డీకాపూల్‌: అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వై.లక్ష్మీపురానికి చెందిన ఆరెంపుల అచ్చయ్య (55) అనారోగ్యం బారినపడి ఈ నెల 19వ తేదీన నిమ్స్‌లో చేరాడు. అతడికి వైద్యులు ఆపరేషన్‌ చేసి 27న స్పెషాలిటీ బ్లాక్‌ రెండో అంతస్తులోని ఓపీ బ్లాక్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి 11 గంటలకు అచ్చయ్య భోజనం చేసిన తర్వాత బెడ్‌పై నిద్రపోయాడు. ఆయన కుమారుడు గుర్నాథం కుర్చీపై పడుకున్నాడు. తెల్లవారు జామున 3.15 గంటకుకు గుర్నాథం లేచి చూడగా మంచంపై తండ్రి కనిపించలేదు. వెంటనే వెయిటింగ్‌ రూం, వాష్‌ రూంల్లో వెతికినా కనిపించలేదు. కిటికీలోంచి కిందకు చూడగా కొంతమంది దూకొద్దు అని అరుస్తుండటాన్ని గుర్నాథం గమనించాడు. అతను కిందకు వెళ్లేలోగా తండ్రి అచ్చయ్య కిందకు దూకేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అచ్చయ్యను నిమ్స్‌ సెక్యురిటీ సిబ్బందితో కలిసి అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. ఉదయం 5.30 గంటలకు అచ్చయ్య మృతి చెందాడు. అనారోగ్యం, మానసిక ఒత్తిడితోనే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుమారుడు గుర్నాథం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా.. నిమ్స్‌ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది తొందరగా స్పందించి అప్రమత్తమై ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఏడో అంతస్తుపై నుంచి పడి ఏసీ మెకానిక్‌ మృతి

రాజేంద్రనగర్‌: ప్రమాదవశాత్తు ఏడో అంతస్తుపై నుంచి పడి ఏసీ ఫిట్టింగ్‌ మెకానిక్‌ మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాంపల్లి ప్రావిడెంట్‌ అపార్ట్‌మెంట్‌లో 14వ బ్లాక్‌ ఏడో అంతస్తులో ఏసీ బిగించేందుకు బార్కస్‌ ప్రాంతానికి చెందిన సమీర్‌ (26) శనివారం మధ్యాహ్నం వచ్చాడు. మరో మెకానిక్‌తో కలిసి ఏసీ అవుట్‌ డోర్‌ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కారు బోల్తా: ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

దుండిగల్‌: అతివేగంగా వచ్చిన కారు మూలమలుపు వద్ద అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ శంకరయ్య కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా ఇమామాబాద్‌ గ్రామానికి చెందిన మహేందర్‌రెడ్డి కుమారుడు నాయిని కల్యాణ్‌రెడ్డి (20) మైసమ్మగూడలోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులు జానకీరాం, చందు, ధనుష్‌, శివసాయిలతో కలిసి కొంపల్లిలో ఉంటున్నాడు. వీరంతా శనివారం రాత్రి కారులో బాచుపల్లిలోని ఇతర స్నేహితులను కలిసి భోజనం చేశారు. అనంతరం తిరిగి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో కారులో కొంపల్లి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న కారు సాయినాథ్‌ సొసైటీ మూలమలుపు వద్ద అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. కారు ముందు సీట్లో కూర్చున్న కల్యాణ్‌రెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుతున్న జానకీరాం, స్నేహితులు చందు, ధనుష్‌, శివ సాయిలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement