వినిపించని ‘ప్రజావాణి’! | Sakshi
Sakshi News home page

వినిపించని ‘ప్రజావాణి’!

Published Tue, Jan 30 2024 6:04 AM

- - Sakshi

సాక్షి,హైదరాబాద్: కాళ్లు ఈడ్చుకుంటూ జీహెచ్‌ఎంసీ కార్యాలయాల దాకా వెళ్లినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు భావించినట్టున్నారు..‘ప్రజావాణి’కి హాజరు కావడం లేదు. జీహెచ్‌ఎంసీలో మూడేళ్లక్రితం రద్దయిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో, 22వ తేదీన ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. తొలుత భారీ సంఖ్యలోనే హాజరైన ప్రజలు తమ ఫిర్యాదులందజేశారు. వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని మేయర్‌ బహిరంగంగా ప్రకటించారు. కానీ ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదు.

అందుకనే కాబోలు ప్రజావాణికి వచ్చే వారు భారీగా తగ్గిపోయారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గత వారం జరిగిన ప్రజావాణికి 86 మంది తమ సమస్యలు ఫిర్యాదు చేయగా, ఈ సోమవారం అందులో సగం మంది కూడా రాలేదు. కేవలం 37 మంది మాత్రమే హాజరయ్యారు. జోనల్‌ కార్యాలయాల్లోనూ పరిస్థితి ఇంతకంటే అధ్వాన్నంగా ఉంది. ఖైరతాబాద్‌ జోన్‌లో ఒకే ఒక్క ఫిర్యాదు అందిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వివిధ విభాగాల అధికారులు ఒక పూటంతా ఉండే కార్యక్రమానికి ఒకే ఒక్కరు రావడం చర్చనీయాంశమైంది. ఇక చార్మినార్‌, సికింద్రాబాద్‌ జోన్లలో పదిమంది వంతున హాజరయ్యారు. కూకట్‌పల్లి జోన్‌లో 39 పిర్యాదులు, శేరిలింగంపల్లి జోన్‌లో 29 ఫిర్యాదులందాయి.

టౌన్‌ప్లానింగే ఘనం..
నగరంలో జీహెచ్‌ఎంసీ అయినా, హెచ్‌ఎండీఏ అయినా, శివారు మునిసిపాలిటీల్లో అయినా భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోనే అవినీతి ఎక్కువ. అందుకే ఆ విభాగానికి సంబంధించిన ఫిర్యా దులే ఇతర విభాగాల కంటే ఎక్కువగా ఉంటాయి. జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి మొత్తం 45 ఫిర్యాదులందాయి. వీటిల్లో 13 ప్రధాన కార్యాలయంలో అందగా, 10 కూకట్‌పల్లి జోన్‌లో అందాయి.

నిధులు లేక నిలిచిన పనులు
జీహెచ్‌ఎంసీ ఖజానాలో నిధులు లేక, పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరగక పనులు చేయడం లేరు. దీంతో ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి 21 ఫిర్యాదులందాయి. టౌన్‌ప్లానింగ్‌ తర్వాత అధిక ఫిర్యాదులు ఈ విభాగానివే. ప్రధాన కార్యాలయం, జోన్లలో వెరసి మొత్తం 138 ఫిర్యాదుల్లో దాదాపు సగం ఫిర్యాదులు ఈరెండు విభాగాలవే కావడం గమనార్హం.

మాటలు తప్ప అమలేదీ..?
సోమవారం ప్రజాపాలనలో అందిన ఫిర్యాదులన్నీ శనివారంలోగా పరిష్కారం చేసి, నివేదిక వెల్లడించాలని మేయర్‌ విజయలక్ష్మి ఆదేశించినా అమలు జరగలేదు. గడచిన వారాల్లో మొత్తం ఫిర్యాదుల్లో ఎన్ని పరిష్కారమయ్యాయో అధికారులు వివరాలు వెల్లడించలేదు. ఫిర్యాదు తీసుకున్నప్పుడే ఏతేదీలోగా పరిష్కారమవుతుందో లిఖితపూర్వకంగా తెలియజేయాలని కూడా ఆదేశించారు. కానీ అమలు కావడం లేదు. సమస్యలు పరిష్కారం కానప్పుడు, సమయం, డబ్బు వెచ్చించి అంత దూరం వెళ్లడం వృథా అనే నిరాశతోనే ప్రజావాణికి ప్రజల హాజరు తగ్గినట్లు తెలుస్తోంది.

సోమవారం ప్రధాన కార్యాలయంతో పాటు జోన్లవారీగా అందిన మొత్తం అర్జీలు

ప్రధాన కార్యాలయం: 37

చార్మినార్‌ జోన్‌: 10

సికింద్రాబాద్‌ జోన్‌: 10

కూకట్‌పల్లి జోన్‌:39

శేరిలింగంపల్లి జోన్‌: 29

ఖైరతాబాద్‌ జోన్‌: 1

ఎల్‌బీనగర్‌ జోన్‌: 12

ఫోన్‌ ఇన్‌ ఏదీ ?
జీహెచ్‌ఎంసీ కార్యాలయాల దాకా రాలేని వారి కోసం ప్రజావాణి జరిగే రోజున ప్రధాన కార్యాలయంలో ఒక గంట సేపు ఫోన్‌ ద్వారా ప్రజల సమస్యల్ని కమిషనర్‌ వింటారని ప్రకటించారు. కానీ రెండు వారాలు గడిచినా ఇంతవరకు ఆ కార్యక్రమం నిర్వహించలేదు.

Advertisement
Advertisement