Sakshi News home page

నాలుగు నెలలైనా వీధిలైట్లు వేయరా?

Published Tue, Jan 30 2024 6:04 AM

కట్ట మైసమ్మ దేవాలయం వద్ద పవర్‌ బోరును ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి    - Sakshi

నాంపల్లి: బస్తీవాసులు ఫిర్యాదు చేసి నాలుగు నెలలైనా కనీసం వీధి లైట్లు వేయకపోతే ఎలా? అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని నాంపల్లిలో పర్యటించారు. మల్లేపల్లి డివిజన్‌ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఆయన పవర్‌ బోరును ప్రారంభించారు. అనంతరం గడపగడపకు వెళ్తూ స్థానిక ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.

తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. స్థానికంగా వీధిలైట్లు లేవని, అర్థరాత్రి బస్తీలో బయటకు రావాలంటే భయమేస్తోందని తెలిపారు. దీంతో కిషన్‌రెడ్డి అక్కడే ఉన్న సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. వీధిలైట్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు నెలలుగా సమస్యను చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సీరియస్‌ అయ్యారు. మరమ్మతుల మెటీరియల్‌కు నిధులు లేవని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌కు ఫోన్‌ కలిపారు. వీధిలైట్ల కోసం అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతున్నారని మండిపడ్డారు. వెంటనే తగిన చర్యలు తీసుకొని వీధిలైట్లు వేయించాలని కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

లోప్రెషర్‌పై మంత్రి అసహనం
కట్ట మైసమ్మ దేవాలయం వద్ద కేంద్ర మంత్రి ప్రారంభించిన పవర్‌బోరు నుండి లోప్రెషర్‌తో నీరు రావడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడి స్థానిక బీజేపీ నేతలను, వాటర్‌ వర్క్స్‌ అధికారులపై మండిపడ్డారు. లోప్రెషర్‌ ఎందుకు వస్తోందంటూ అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటివన్నీ ప్రారంభోత్సవానికి ముందే సరిచూసుకోవాలని హితబోధ చేశారు. ఒక బిందె నిండటానికి ఇరవై నిమిషాలు పడితే మహిళలు మంచినీటి కోసం ఘర్షణ పడాలా...? అంటూ అక్కడే ఉన్న వాటర్‌ వర్క్స్‌ మేనేజరు నదీమ్‌పై గుస్సా చేశారు. పరిస్థితి చక్కదిద్దాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురవుతారని సూచించారు.

Advertisement
Advertisement