మైనర్‌కు వాహనమిస్తే ముప్పు తప్పదు!! | Sakshi
Sakshi News home page

మైనర్‌కు వాహనమిస్తే ముప్పు తప్పదు!!

Published Mon, Feb 5 2024 5:58 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్: మైనర్లు వాహనం నడుపుతూ బయటకు వచ్చారంటూ ఆ తప్పు పూర్తిగా వారిదే కాదు. వారికి వాహనాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు, యజమానిదీ తప్పే’ అంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో పాటు గతంలో అనేక ఉదంతాల్లో మైనర్‌ డ్రైవింగ్‌ పలువురి ప్రాణాలు తీసింది. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న నగర పోలీసులు మైనర్‌ డ్రైవింగ్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనికి సంబంధించిన కేసుల్లో వాహన యజమానిపైనా కేసు నమోదు చేసి, కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయనున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.51లో గత నెల 14న రాత్రి కియా కారుతో ప్రమాదం చేసిన ఎర్రగడ్డకు చెందిన మైనర్‌తో (17) పాటు అతడి తండ్రిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విధానాన్ని రానున్న రోజుల్లోనూ కొనసాగించనున్నారు. శాంతిభద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్‌ అధికారులు దీన్ని అమలు చేస్తారు.

మూడో కేటగిరీలో మైనర్‌ డ్రైవింగ్‌..
ట్రాఫిక్‌ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటరిగీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచ్చిపెట్టేవి. మైనర్‌ డ్రైవింగ్‌ మూడో కేటగిరీ పరిధిలోకి వస్తుందని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. ఏటా నగరంలో నమోదవుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే.. ద్విచక్ర వాహనాల కారణంగానే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. యువత ఎక్కువగా వినియోగించేది ఈ వాహనాలే. ఆ తర్వాత స్థానం తేలికపాటి వాహనాలైన కార్లు వంటి వాటిది.

ఈ కారణంగానే ప్రమాదాల బారినపడుతున్న, కారణంగా మారుతున్న వాటిలో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో వాహన చోదకులతో పాటు పాదచారులూ ఎక్కువగా మృత్యువాతపడుతున్నారు. ముఖ్యంగా అనేక విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో సొంత వాహనాలపై వాటికి వెళ్లి వచ్చే క్రమంలో ఎందరో యువకులు మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు అడపాదడపా చోటు చేసుకుంటున్న రేసింగ్స్‌ కూడా అనేక మంది ప్రాణాలను హరిస్తున్నాయి. ఇలాంటి మృతుల్లో వాహనాలు డ్రైవ్‌ చేస్తున్న మైనర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు.

నిబంధనలేం చెబుతున్నాయంటే..
భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం (ఎంవీ యాక్ట్‌) పదహారేళ్ల లోపు వయస్సు వారు ఎలాంటి వాహనాలనూ పడపకూడదు. వీరు వాహనాలను నడుపుతూ రోడ్ల పైకి రావడం నిషేధం. 16 ఏళ్లు నిండిన వారు మాత్రం కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత మాత్రమే గేర్లతో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. ఆర్టీఏ అధికారులు లైసెన్స్‌ సైతం వీరికే మంజూరు చేస్తారు. చట్ట ప్రకారం మైనర్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని సైతం శిక్షార్హుడే. అంటే ఎవరికై నా మన వాహనాన్ని ఇవ్వాలంటే తొలుత వారు మేజరేనా? డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా? అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న చట్టాలపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, అమలుపై యంత్రాంగాలు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం కారణంగా ఎన్నో ‘ఇంటి దీపాలు’ చిన్న వయసులోనే ఆరిపోతున్నాయి.

ఎంవీ యాక్ట్‌లోని ఆ సెక్షన్‌ వాడుతున్నారు..
వారం రోజుల వ్యవధిలో వరుసగా చోటు చేసుకున్న బహదూర్‌పురా, మెహిదీపట్నం ఉదంతాలతో ట్రాఫిక్‌ పోలీసులు తమ పంథా మార్చుకున్నారు. అప్పటి వరకు మైనర్‌ డ్రైవింగ్‌ కేసుల్లో అత్యంత అరుదుగా మాత్రమే.. అదీ వాహనం నడిపే వ్యక్తిపై చార్జిషీట్‌ దాఖలు చేసే వారు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్‌ ప్రకారం ఓ మైనర్‌ కానీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే.. అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానినీ బాధ్యుడిని చేసే అవకాశం ఉంది. మైనర్‌ నడిపే వాహనం ప్రమాదానికి కారణం కావడమో, గురికావడమో జరిగితేనే కాదు... ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీల్లో చిక్కినా ఈ తిప్పలు తప్పవు. మైనర్లు ఎక్కువగా కుటుంబీకులు, సంబంధీకుల వాహనాలే తీసుకుని బయటకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారే ఆయా కేసుల్లో నిందితులుగా మారే అవకాశం ఉంది. మోటారు వాహనాల చట్టంలోని 181 సెక్షన్‌ కింద వీరిపై కేసు నమోదు చేసి, కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కోర్టులో ఈ నేరం రుజువైతే జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

వాహన యజమానిపైనా అభియోగపత్రాలు దాఖలు

ఉల్లంఘనను కోర్టులు తీవ్రంగా పరిగణించే అవకాశం

జూబ్లీహిల్స్‌ ప్రమాదంలో బాలుడి తండ్రిపైనా కేసు

ఈ విధానం కొనసాగించాలని నగర పోలీసుల నిర్ణయం

Advertisement
Advertisement