మజ్లిస్‌ దూకుడు | Sakshi
Sakshi News home page

మజ్లిస్‌ దూకుడు

Published Mon, Apr 1 2024 7:20 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల కోసం మజ్లిస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టిన మజ్లిస్‌ పార్టీ.. రంజాన్‌ మాసం ఇఫ్తార్‌ విందులను సైతం సద్వినియోగం చేసుకుంటోంది. రోజుకో డివిజన్‌లో ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరు కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

మజ్లిస్‌ పార్టీకి హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ.. పోలింగ్‌ భారీగా జరిగేలా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇఫ్తార్‌ విందుల్లో సైతం పోలింగ్‌ ప్రస్తావన తీసుకొని రావడం ఇందుకు బలంచే కూరుతోంది. గత ఎన్నికల్లో సైతం పాదయాత్రలు, బహిరంగ సభల్లో పోలింగ్‌ శాతం పెంపు ప్రస్తావన ప్రధానాంశంగా కొనసాగించింది. ఈసారి సైతం పోలింగ్‌ పెంపుపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

మెజారిటీ కోసం..

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజిక వర్గం వారే. పోలింగ్‌ ఎంత ఎక్కువగా నమోదైతే అంతే స్థాయిలో మెజారిటీ పెరుగుతుందని మజ్లిస్‌ పార్టీ భావిస్తోంది. ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీకి పోలింగ్‌ శాతమే మెజారిటీపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌ లోక్‌సభకు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో మజ్లిస్‌ పక్షాన అప్పట్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో దిగిన అబ్దుల్‌ వాహెద్‌ ఓవైసీ, ఆ తర్వాత బరిలో దిగిన సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీల ఓటములకు పోలింగ్‌ శాతమే ప్రభావం చూపింది. ఆ తర్వాత పోలింగ్‌ శాతం పెంపుపై దృష్టి సారించడంతో సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఓవైసీ జైత్రయాత్ర ప్రారంభమైంది.

అనంతరం అసదుద్దీన్‌ ఒవైసీ విజయ పరంపర కొనసాగుతోంది. క్రమంగా పెరుగుతున్న పోలింగ్‌ శాతం మజ్లిస్‌ను ఎదురు లేని శక్తిగా తయారు చేసినట్లయింది. గత నాలుగు పర్యాయాల్లో పాతబస్తీపై గట్టి పట్టు సాధించి ఎన్నికలను ఏకపక్షంగా మార్చినప్పటికీ పెరుగుతున్న ఓటర్లకు అనుగుణంగా మెజారిటీ పెరగకపోవడం మింగుడు పడని అంశంగా తయారైంది. దీంతో అత్యధిక మెజారిటీ కోసం పోలింగ్‌ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మజ్లిస్‌ పార్టీ.

Advertisement
Advertisement