నిర్ధాక్షిణ్యంగా బిడ్డను వదిలేసింది..అదే ఉచ్చులా మారి కటకటాల్లోకి నెట్టింది! | Sakshi
Sakshi News home page

నిర్ధాక్షిణ్యంగా బిడ్డను వదిలేసింది..అదే ఉచ్చులా మారి కటకటాల్లోకి నెట్టింది!

Published Sat, May 20 2023 9:44 PM

Baby Left To Die In US Solved After 4 Years With Indian Origin Womans Arrest - Sakshi

నాలుగేళ్ల క్రితం నాటి కేసు అనుహ్యంగా ఆమె అరెస్టుతో చిక్కుముడి వీడింది. ఆమె బిడ్డను కని వదిలించేసుకున్నా.. అనుకుంది. కనివినీ ఎరుగని రీతిలో అదే తనకు ఉచ్చులా బిగిసి జైల్లోకి వెళ్లేలా చేస్తుందని ఊహించుకుని కూడా ఉండదు ఆ తల్లి. ఈ షాకింగ​ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని జార్జియాలో ఓ మహిళ ఆడ శిశువుని కని నిర్ధాక్షిణ్యంగా అడవిలో ఒక చెక్‌పెట్టేలో వదిలేసింది. సమీపంలోని ఓ కుటుంబం ఫోర్సిత్‌ కౌంటీ షెరీఫ్‌(పోలీసులు)కు సమాచారం అందించడంతో వారు ఆ శిశువుని స్వాధీనం చేసుకుని ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు.

ఆ చిన్నారికి ప్రస్తుతం నాలుగేళ్లు. ఆమె పూర్తి ఆరోగ్యంతో బాగానే ఉంది. సదరు ఆస్పత్రి ఆ చిన్నారిని 'బేబి ఇండియాగా' పిలిచేది. ఆ తర్వాత ఆ శిశువును ఒక కుటుంబం దత్తత కూడా తీసుకుంది. అయితే కౌంటీ షెరీఫ్‌  ఆ చిన్నారి గోప్యత నిమిత్తం పూర్తి వివరాలను అందించలేదు. ఐతే ఆ శిశువుని ఎవరో అలా వదిలేశారనే దానిపై గత నాలుగేళ్లుగా కౌంటీ షెరీఫ్‌ అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. పది నెలల క్రితం ఆ శిశువు డీఎన్‌ఏ ఆధారంగా ఆ చిన్నారి తండ్రిని పట్టుకోగలిగారు. గానీ ఆ మహిళ గర్భవతి అని కూడా అతనికి తెలియకపోవడం, ఆమెను వదిలేశానని చెప్పడం తదితర కారణాలతో కేసు మళ్లి మొదటికి వచ్చినట్లు అనిపించింది అధికారులకు.

చేసేదేమిలేక అధికారులు సదరు తండ్రిని అరెస్టు చేయకుండా వదిలేశారు. ఎట్టకేలకు వారి దర్యాప్తు ఫలించి..ఆ చిన్నారి తల్లి ఆచూకిని కనుగొనడమే గాక బిడ్డ తల్లిని కరిమా జివానీగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రసవం తర్వాత వదిలేయాలనే ఉద్దేశ్యంతోనే ఓ కారులో నిర్మానుష్యమైన అడవికి వచ్చినట్లు పేర్కొంది. అక్కడే ‍ప్రసవించి శిశువుని ఓ ప్లాస్టిక్‌ సంచిలో చుట్టి ఓ చెక్కబాక్స్‌లో ఉంచినట్లు విచారణలో ఒప్పుకుంది. జార్జియ నిబంధనల ప్రకారం ఆస్పత్రి, పోలీస్టేషన్‌, అగ్నిమాపక స్టేషన్‌లో పిల్లలను వదిలేసినట్లయితే ఎలాంటి నేరారోపణ ఎదుర్కొనవలసిన అవసరం లేదు.

కానీ ఈ తల్లి కనీసం అలాంటి నిబంధనలను ఏమి ఉపయోగించకుండా ఆ శిశువు చనిపోవాలనే ఉద్దేశంతోనే ఇలా నిర్మానుష్యమైన అడవిలో వదిలేసిందని కౌంటీ షరీష్‌ అధికారులు చెప్పుకొచ్చారు. దేవుడిలా ఓ కుటుంబ మాకు సమాచారం అందించడంతోనే ఆ శిశువుని కాపాడగలిగామని చెప్పారు. ఈ మేరకు అధికారులు నాలుగేళ్ల అనంతరం  సదరు మహిళపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఐతే ఆ తల్లి జివానీకి మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఎప్పుడో చేసిన నేరం కనుమరగవుతుందనుకుంటే నీడలా వెంటాడి దోషిలా పట్టించేంత వరకు వదలలేదు ఆ తల్లిని. 

(చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..)


 

Advertisement
Advertisement