ప్రమాదంలో తేనెటీగలు.. మానవాళి మనుగడకే ముప్పు! | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో తేనెటీగలు.. మానవాళి మనుగడకే ముప్పు!

Published Wed, Feb 15 2023 8:57 AM

 Bee Alert 18 Species Of Bees Disappear In 100 Years - Sakshi

సాక్షి, అమరావతి: తేనెటీగలు.. సృష్టిలోనే ఓ గొప్ప సహజసిద్ధ ఇంజనీర్లు. షడ్భుజాలతో ఆరు వేల గదుల ఇళ్లను పక్కపక్కనే నిరి్మంచుకోగల సామర్థ్యం వీటి సొంతం. సమైక్య జీవనానికి ప్రతీకలైన మధుమక్షికలు వేలాది కిలోమీటర్ల మేర ప్రయాణించి.. పూలలోని మకరందాన్ని సేకరించుకొస్తాయి. వీటి నిరంతర శ్రమ వల్లే భూలోకంలోని చెట్లు, మొక్కలు మనగలుగుతున్నాయి. ఎన్నో పంటలు వీటివల్లే పండుతున్నాయి.

ఈ చిరు ప్రాణులు జీవకోటికి చేస్తున్న మేలు ఎంతంటే.. తేనెటీగలు మొత్తం అంతరించిపోతే కేవలం 30 రోజుల్లో భూమండలంపై ప్రాణికోటి కూడా అంతరించిపోతుంది. అంతటి విశిష్టత గల తేనెటీగలకు మానవాళి వల్ల పెద్ద కష్టమే వచి్చపడింది. 180 రకాల తేనెటీగల జాతులు అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాయని ఐక్యరాజ్య సమితి తేల్చింది. వీటిని సంరక్షించేందుకు రంగంలోకి దిగింది. 

భూమండలాన్ని పచ్చగా ఉంచేందుకు మట్టి, నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో తేనెటీగలు (మధుమక్షికలు) కూడా అంతే అవసరం. నేలపై ఉన్న వృక్ష జాతులతోపాటు 90 శాతానికి పైగా పంటలు తేనెటీగల వల్లే అభివృద్ధి చెందుతున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. మానవాళి జీవితం మొత్తం ఇతర జీవులతో ముడిపడి ఉంది. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రాణి తేనెటీగ. ప్రకృతికి ఎంతో మేలు చేస్తున్న తేనెటీగలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. కేవలం పూల మకరందంపై ఆధారపడి జీవించే తేనెటీగలు పంటలపై మితిమీరి వినియోగిస్తున్న పురుగు మందులు, కాలుష్యం కారణంగా మరణిస్తున్నాయి.

ఐక్యరాజ్య సమితి సైతం తేనెటీగల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని అన్ని దేశాలను కోరుతోందంటే వీటి అవసరం ప్రపంచానికి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తేనెటీగలు జీవ వైవిధ్యంలో భాగం. మా­నవ మనుగడ అంతా వాటిపైనే ఆధారపడి ఉంది. పంటలు సకాలంలో పండడంలో కీలకమైన పరపరాగ సంపర్కానికి అత్యంత వేగవంతమైన వాç­ßæకాలుగా ఇవి సేవలు అందిస్తున్నాయి. ఇది నా­ణేనికి ఒకవైపు అయితే, ప్రజలకు అత్యంత నాణ్యమైన ఆహారమైన తేనె, రాయల్‌ జెల్లీ, మైనం వంటి వాటిని అందించడంతో పాటు తేనెటీగల విషా­న్ని సేకరించి ఇతర ఉత్పత్తులకు వినియోగిస్తున్నారు.   

పురుగు మందుల వాడకంతో.. 
పంటల రక్షణ కోసం పురుగు మందులను మితిమీరి వినియోగిస్తుండటంతో తేనెటీగల జాతి తగ్గిపోతోందని జీవవైవిధ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా తేనెటీగలు పూల సువాసనను గుర్తించలేకపోతున్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల జాతులు అంతరించిపోతున్నట్టు యూకే అగ్రికల్చరల్‌ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఆ దేశంలో గత పదేళ్లలో 13 జాతులు అంతరించిపోగా.. మరో 35 జాతులు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించింది. అందుకు పంటలకు వాడుతున్న నికోటినాయిడ్స్‌ కారణమని వెల్లడించింది. వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 18 జాతులు పూర్తిగా కనుమరుగైపోయాయని, మరో 180 జాతులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ కన్జర్వేషన్‌ క్యూరేట్‌ (ఐయూసీఎన్‌) ప్రకటించింది. యుద్ధప్రాతిపదికన తేనెటీగల సంతతిని పెంచకపోతే సమీప భవిష్యత్‌లో ప్రపంచం ఆహార కొరతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.  

రక్షణకు తక్షణ చర్యలు అవసరం  
మొక్కలు, పూల పరాగ సంపర్కానికి తేనెటీగల అవసరాన్ని గుర్తించిన యూరోపియన్‌ యూనియన్‌ 2018 మేలో నియోనికోటినాయిడ్స్‌ అని పిలిచే మూడు రకాల పురుగుమందులపై నిషేధాన్ని విధించింది. అయితే, అంతకు ముందే 2011లో స్లోవేనియా దేశం తేనెటీగలకు హానికరమైన చాలా పురుగు మందులను నిషేధించిన తొలి దేశంగా గుర్తింపు పొందింది. కాగా, 2019 చైనాలోని కుని్మంగ్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్‌ (కాప్‌–15)లో 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులు తగ్గించాలని నిర్ణయించింది.

ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల కొరతను తగ్గించాలంటే తేనెటీగల సంఖ్య పెరగాలని.. ఆ ప్రాణులు బతకాలంటే రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం ఒక్కటే పరిష్కారమని ఆ సదస్సులో ప్రతినిధులు పేర్కొన్నారు. తేనెటీగల ఆవాసాలను రక్షించడానికి, ప్రభుత్వాలు, సంస్థలు, పౌర సమాజాన్ని చైతన్యం చేసి ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఏటా మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది.  

మూడో వంతు ఆహారోత్పత్తి వీటివల్లే.. 
ఇంటర్‌ గవర్నమెంటల్‌ సైన్స్‌ పాలసీ ప్లాట్‌ఫామ్‌ ఆన్‌ బయోడైవర్సిటీ అండ్‌ ఎకో సిస్టం సరీ్వస్‌ (ఐపీబీఈఎస్‌) పేర్కొంటున్న ప్రకారం దాదాపు 80 మిలియన్ల సంవత్సరాలుగా తేనెటీగల ప్రపంచంలో అత్యంత పరాగ సంపర్కం చేసి నేరుగా ఆహార భద్రతకు దోహదం చేస్తున్నాయి. ఏటా 1.77 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల తేనెను మనకు అందిస్తున్నాయి.

ప్రపంచంలోని ఆహార ఉత్పత్తిలో మూడోవంతు తేనెటీగల పైనే ఆధారపడి ఉందని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) ప్రకటించిందంటే వీటి ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు. తుమ్మెదలు, సీతాకోక చిలుకలు, పక్షులు, కొన్ని జంతువులు, కీటకాలు పరాగ సంపర్కానికి, మొక్కల పునరుత్పత్తికి దోహదం చేస్తున్నా.. అత్యంత సాధారణ పరాగ సంపర్కాలలో తేనెటీగలు ముందున్నాయి.
చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ప్రేయసి హ్యాండ్‌ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా?

Advertisement

తప్పక చదవండి

Advertisement