మరో రెండు విపత్తులు.. కోటి మరణాలు: బిల్‌గేట్స్‌

6 Feb, 2021 13:23 IST|Sakshi

సంచలన వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్‌

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన తొలి నాళ్లలో మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్ ‌గేట్స్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవ్వడమే కాక పలు అనుమానాలను రేకేత్తించింది. 2015నాటి ఈ వీడియోలో బిల్‌ గేట్స్‌.. కరోనా గురించి ముందుగానే హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మానవ నిర్మిత వైరస్‌ ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని పేర్కొన్నారు. ఆయన మాటలు 2020లో వాస్తవ రూపం దాల్చాయి. గతేడాది వెలుగు చూసిన కరోనా వైరస్‌ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిందేనని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బలంగా విశ్వసిస్తున్నారు. అయితే విధ్వంసం ఇంతటితో ఆగలేదని గేట్స్‌ హెచ్చరించారు. మరో రెండు విపత్తులు ప్రపంచాన్ని కకావికలం చేస్తాయని తెలిపారు. వచ్చే పదేళ్లలో ఈ విపత్తులు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని పొట్టనపెట్టుకుంటాయన్నారు. 

వాతావరణ మార్పులు, బయో టెర్రరిజాలే ఆ రెండు విపత్తులు అన్నారు. ‘‘వచ్చే దశాబ్ద కాలంలో దాదాపు 10 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు హరించేది యుద్ధం కాదు.. వైరస్‌. అవును మిస్సైల్స్‌, మైక్రోబ్స్‌ కాదు.. చాలా ప్రమాదకరమైన వైరస్‌ వల్ల కోటి మంది మరణిస్తారు. ఇక మీదట వచ్చేవి అన్ని బయో వార్‌లే’’ అన్నారు బిల్ ‌గేట్స్‌. డెరేక్‌ ముల్లర్‌ అనే వ్యక్తి నడుపుతోన్న యూట్యూబ్‌ చానెల్‌ వెరిటాసియంలో బిల్‌ గేట్స్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరు సంవత్సరాల క్రితం నాటి ఈ వీడియో ప్రస్తుతం మరో సారి ఇంటర్నెట్‌లో వైరలవుతోంది. 

ఎబోలా వైరస్‌ వ్యాప్తి సమయంలో గేట్స్‌ సమీప భవిష్యత్తులో ఇంతకంటే ప్రమాదకరమైన వైరస్‌లు మన మీద దాడి చేస్తాయని.. వాటి నుంచి రక్షణ పొందటానికి మన దగ్గర ఎలాంటి ఆయుధం ఉండదని తెలిపారు. ఆయన మాటల ప్రకారం 2020లో వెలుగు చూసిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా 2.271 మిలియన్ల మందిని బలి తీసుకోగా.. 104.3 మిలియన్ల మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే తన ఊహాలు ఏవి నిజం కాకూడదని బిల్‌గేట్స్‌ కోరుకున్నారు. ఇవన్ని అంచనాలుగానే ఉండాలని ఆశించారు. 

చదవండి: రానున్న 6 నెలలు ప్రమాదకరం: బిల్‌ గేట్స్‌
                 మాస్క్‌లు ధరించి ఉంటే లక్ష మరణాలు తగ్గేవి 

మరిన్ని వార్తలు