భారత్‌పై కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు.. రాయబారిపై వేటు | Sakshi
Sakshi News home page

ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో భారత్ ప్రమేయం: కెనడా ప్రధాని 

Published Tue, Sep 19 2023 8:05 AM

Canada PM Justin Trudeau Blames India In Khalistani Terrorist Murder - Sakshi

ఒట్టావా: కెనడాలో ఇటీవల జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది భారతీయ ఏజెంట్లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారముందని అన్నారు.  

 

ఇదే ఏడాది జూన్‌లో సర్రేలోని గురుద్వారా ముఖద్వారం వద్ద ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జలంధర్‌లో హిందూ పూజారిని చంపిన కేసులో ఖలిస్థానీ టైగర్‌ ఫోర్స్‌కు చెందిన నిజ్జర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ప్రకటించింది. అతడిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. నిజ్జర్ హత్య కేసులో ప్రమేయం ఉందన్న కారణంతో కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను బహిష్కరించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. అయితే ఆ అధికారి పేరుని మాత్రం వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలో ఒట్టావాలోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ పాత్ర ఉందని ఆరోపించారు. ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను చంపిన కేసులో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని దీనికి సంబంధించి తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. హత్యోదంతంపై భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని కెనడా పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన అని ప్రకటించారు. భారత ప్రభుత్వం ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరారు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సమావేశాల సమయంలోనే ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర ప్రధాని ట్రూడో తెలిపారు. 

భారత రాయబారిపై వేటు..
ట్రూడో ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన కెనడా.. భారత రాయబారిపై బహిష్కరణ వేటు వేసింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి పవన్‌ కుమార్‌ రాయ్‌ను బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జాలీ తెలిపారు. ఈ మేరకు టొరంటో మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై ఒట్టావాలోని భారత ఎంబసీ స్పందించలేదు.

తీవ్రంగా ఖండించిన భారత్‌..
ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘కెనడాలో జరిగిన హత్యలో భారత్‌ జోక్యం ఉందంటూ ఆ దేశం అసంబద్ద, ప్రేరేపిత ఆరోపణలు చేస్తోంది. చట్టబద్దమైన పాలన పట్ల నిబద్ధతతో కూడిన ప్రజాస్వామ్య విధానం మాది. కెనడాలో ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమత్వానికి ముప్పుగా మారిన ఖలిస్థానీ ఉగ్రవాదులు, అతివాదుల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ వద్ద కూడా కెనడా ప్రధాని ఇలాంటి ఆరోపణలే చేశారు. సుదీర్ఘంగా నెలకొన్న ఈ ఖలిస్థానీ వివాదంపై భారత్‌ చేసిన డిమాండ్లపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరం. కెనడాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు వంటివి జరగడం కొత్తేం కాదు. అలాంటి వాటిల్లోకి భారత ప్రభుత్వాన్ని లాగే ప్రయత్నాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కెనడాలో నుంచి భారత వ్యతిరేక శక్తులను వెళ్లగొట్టేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మేం మరోసారి కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

ఇది కూడా చదవండి: చైనా దురాక్రమణ యత్నాలు తీవ్రతరం?    

Advertisement
Advertisement