పాక్‌లో చెలరేగుతున్న హింస.. ఎన్నికలే కారణమా? | Is The Elections Are The Reason For The Violence That Is Breaking Out In Pakistan? Details Inside - Sakshi
Sakshi News home page

Pakistan: పాక్‌లో చెలరేగుతున్న హింస.. ఎన్నికలే కారణమా?

Published Thu, Feb 1 2024 8:46 AM

Is the election the reason for the violence that is breaking out in Pakistan - Sakshi

పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ముందుగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 31న ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని బజౌర్ జిల్లాలో రాజకీయ నేత రెహాన్ జెబ్ ఖాన్‌ను కాల్చి చంపారు. 

రెహాన్ జెబ్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్‌ఏ-8,  పీకే-22 స్థానాల నుండి పోటీ చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు రెహాన్ ఉన్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జియో టీవీ కథనం ప్రకారం రెహాన్ జెబ్ ఖాన్ ఎన్నికల ప్రచారం కోసం సాదికాబాద్ ఫటక్ బజార్ ప్రాంతానికి వెళ్లారు. ఇంతలో దుండగులు అతనిపై కాల్పులు జరపడంతో, అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కూడా రెహాన్ హత్యను ఖండించింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి.. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఈ ఘటనకు సంబంధించిన నివేదికను కోరింది. దీంతో పాటు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికిముందు బలూచిస్థాన్‌లోని చమన్ నగరంలో అవామీ నేషనల్ పార్టీ కార్యకర్తలపై కాల్పులు జరిగాయి. 

ఈ ఘటనలో ఒక కార్యకర్త మృతి చెందాడు. కార్యకర్తలు ప్రచారంలో మునిగివున్న సమయంలో ఈ ఘటన జరిగింది.  ఇదేవిధంగా క్వెట్టాలోని సరియాబ్ రోడ్‌లోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎన్నికల కార్యాలయంపై జరిగిన దాడిలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. బలూచిస్థాన్ తాత్కాలిక హోం మంత్రి జుబేర్ జమాలీ ఈ దాడులను ఖండించారు. ఇటీవల స్వాబి జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి షా ఖలీద్‌ను కాల్చి చంపారు. అలాగే పీకే-104 నుండి పోటీ చేసిన కలీముల్లా ఖాన్‌ను దుండగులు హత్య చేశారు.

Advertisement
Advertisement