ట్విటర్‌ను వీడిన ఆమె.. ఎలన్‌ మస్క్‌కు ఘోర అవమానం!

3 Nov, 2022 21:25 IST|Sakshi

ప్రపంచ అపరకుబేరుడు ఎలన్‌ మస్క్‌కు ఘోర అవమానం జరిగిందా?.. అవుననే చర్చ సోషల్‌ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. అందుకు కారణం.. మాజీ ప్రేయసి అంబర్‌ హర్డ్‌. 

ఎలన్‌ మస్క్‌.. ఎట్టకేలకు ట్విట్టర్‌(ట్విటర్‌) డీల్‌ను ముగించిన సంగతి తెలిసిందే. మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించిన మస్క్‌.. తొలుత యూజర్ల అభిమానాన్ని చురగొన్నాడు కూడా. అయితే.. ట్విట్టర్‌ ఆఫీస్‌లో అడుగుపెట్టాక తనదైన నిర్ణయాలతో ట్విట్టర్‌ను ఆగం పట్టిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రధాన మార్పుల పేరిట బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ నుంచి.. కీలక పదవుల్లో ఉన్న వాళ్లను సాగనంపగా.. ఆపై టెస్లా ఉద్యోగులను ట్విటర్‌లోకి తెచ్చుకున్నాడు. మరోవైపు వెరిఫికేషన్‌ ప్రాసెస్‌కు, బ్లూటిక్‌ కోసం 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించి.. పక్కా కమర్షియల్‌ ఆలోచనను అమలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేస్తూ కొందరు సెలబ్రిటీలు ట్విటర్‌ను వీడుతున్నారు. 

ట్విటర్‌ను ఇప్పటికే చాలామంది ప్రముఖులు వీడారు. టోనీ బ్రాక్స్‌టన్‌, షోండా రిమ్స్‌తో పాటు ప్రొఫెషనల్‌ రెజ్లర్‌(రిటైర్డ్‌)..డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ మిక్‌ ఫోలీ ట్విటర్‌ అకౌంట్లను డిలీట్‌ చేశారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి నటి అంబర్‌ హర్డ్‌ కూడా చేరింది. ఆమె ఎందుకు వీడిందో అనే దానిపై స్పష్టత లేకున్నా.. సెలబ్రిటీల గుడ్‌బై మూమెంట్‌లో ఆమె కూడా చేరడం పట్ల మస్క్‌పై సెటైర్లు పడుతున్నాయి. మాజీ ప్రేయసి మస్క్‌ పరువు తీసేసిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది కూడా. మరోవైపు ఆమె మాజీ భర్త జానీ డెప్‌ అభిమానుల కారణంగానే ఆమె ట్విటర్‌కు గుడ్‌బై చెప్పి ఉంటుందనే వాదన సైతం చక్కర్లు కొడుతోంది కూడా.

అంబర్‌ హర్డ్‌.. 2016 నుంచి 2018 మధ్య ఎలన్‌ మస్క్‌తో డేటింగ్‌ చేసింది. అయితే అప్పటికే నటుడు జానీ డెప్‌తో ఆమె విడాకులకు సిద్ధమైంది. అయితే మస్క్‌ వల్లే తన కాపురంలో చిచ్చు రగిలిందని, హర్డ్‌ సైకోతనం భరించలేక తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు జానీ డెప్‌. ఈ క్రమంలో జానీ డెప్‌ వేసిన పరువు నష్టం దావా కేసు..  విచారణ సందర్భంగా మస్క్‌ కూడా హాజరవుతాడని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. ఇక ఈ కేసులో ఈ ఏడాది మొదట్లో జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పు వెలువడడం గమనార్హం. అయితే ఆ సమయంలోనూ ఆమెకు సంబంధించిన కోర్టు ఫీజులను ఎలన్‌ మస్క్‌ చెల్లించాడనే వాదన వినిపించింది.

మరిన్ని వార్తలు