అదో బుల్లి కారు.. మనకు నచ్చినట్లు మారుతుంది.

8 Oct, 2021 07:30 IST|Sakshi

అదో బుల్లి కారు..అర్జెంట్‌గా బయటికెళ్లాలంటే మన ముందుకే వచ్చి నిలబడుతుంది. లోపల కూర్చుని అద్దాల్లోంచి చూస్తూ వెళ్లడానికి, ఓపెన్‌ టాప్‌ తరహాలో గాలి తగులుతూ ప్రయాణించడానికి వీలవుతుంది.. స్నేహితులతోనో, వ్యాపార భాగస్వాములతోనో పిచ్చాపాటీ మాట్లాడుతూ, కావాలంటే వైన్‌ తాగుతూ వెళ్లాలనుకుంటే.. అదే కారు చిన్నపాటి ఫైవ్‌స్టార్‌ లాంజ్‌గా మారిపోతుంది. వ్యాయామం చేయడానికి టైం లేదనుకుంటే.. కారే చిన్నపాటి జిమ్‌లా రెడీ అవుతుంది. అంతేకాదు.. ఈ కారు అటానమస్‌/సెల్ఫ్‌ డ్రైవింగ్‌. అంటే డ్రైవర్‌ అవసరం లేకుండా.. మనం కోరుకున్న చోటికి అదే తీసుకెళ్తుంది. ఆ కారు పేరు.. ‘స్కేట్‌’. ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ సిట్రోన్‌ ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును రూపొందించింది.
చదవండి: మార్కెట్లోకి మరో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలే!

పది సెకన్లలో మార్చేసుకోవచ్చు.. 
‘స్కేట్‌’ కారు.. పేరుకు తగినట్టుగా స్కేటింగ్‌ బోర్డులా ఫ్లాట్‌గా ఉంటుంది. దానికి బిగించుకోవడానికి మూడు బాడీలు (పోడ్స్‌) వస్తాయి. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ తరహాలో మెత్తని సోఫా, మినీ బార్‌తో కూడిన ‘సోఫిటెల్‌ వోయేజ్‌’ పోడ్‌ ఒకటికాగా.. వ్యాయామం చేయడానికి పలు పరికరాలతో కూడిన ‘పుల్‌మ్యాన్‌ పవర్‌ ఫిట్‌నెస్‌’ పోడ్‌ ఇంకొకటి. మూడోదేమో.. సగం క్యాబిన్, మిగతా సగం ఓపెన్‌ స్పేస్‌ ఉండే ‘సిటిజన్‌ ప్రొవైడర్‌’ పోడ్‌. దీనిలో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఈ పోడ్‌లలో ఒకదానిని వదిలేసి.. మరోదానిని కేవలం పది సెకన్లలోనే అమర్చేసుకునే వీలుంటుంది.

మన దగ్గరికి అదే వస్తుంది..
ఈ కారు ఇంటర్నెట్‌ సాయంతో మన ఫోన్‌లోని యాప్‌కు లింక్‌ అయి ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా.. కావాలనుకున్నప్పుడు యాప్‌ నుంచి ఆదేశాలు ఇవ్వగానే మన దగ్గరికి బయలుదేరి వచ్చేస్తుంది. దగ్గరిలో ఉన్న చార్జింగ్‌ స్టేషన్‌కు వెళ్లి అదే చార్జింగ్‌ కూడా చేసుకుంటుందని సిట్రోన్‌ కంపెనీ చెప్తోంది.

పక్కకూ నడపొచ్చు..
ఈ కారును ముందుకు, వెనక్కే కాదు.. పక్కలకు, ఐమూలగా ఎలాగంటే అలా నడపడానికి వీలుంటుంది. ఇందుకోసం బంతి ఆకారంలో ఉండే ప్రత్యేకమైన టైర్లను అమర్చారు. అంతేకాదు.. దీనిలో హైడ్రాలిక్‌ సస్పెన్షన్‌ ఏర్పాటు చేశారు. అంటే పెద్దగా కుదుపులు లేకుండా హాయిగా ప్రయాణిస్తుంది. దీనిలో ఉండే రాడార్, లైడార్‌ సెన్సర్ల ద్వారా రోడ్డును, ముందున్న వాహనాలు, మనుషులు, ఇతర అడ్డంకులను గుర్తిస్తూ.. వాటి నుంచి పక్కకు తప్పుకుంటూ దూసుకెళ్తుంది.
-సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు