PM Modi gets grand welcome at White House - Sakshi
Sakshi News home page

Narendra Modi: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్‌ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు

Published Fri, Jun 23 2023 7:53 AM

 Grand Welcome For PM Modi At White House, PM Dines With Bidens Address US Congress - Sakshi

వాషింగ్టన్‌: భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన ఆధ్యాయం చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పినట్లుగా ప్రజాస్వామ్యం అనేది భారత్, అమెరికా దేశాల డీఎన్‌ఏలో ఉందని అన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ రోజు బైడెన్‌తో కీలక అంశాలపై చర్చలు జరిపానని తెలిపారు. ప్రజాస్వామిక విలువల గురించి తాము మాట్లాడుకున్నామని వెల్లడించారు. గురువారం వైట్‌హౌస్‌లో చర్చలు ముగిసిన అనంతరం మోదీ, బైడెన్‌ ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు.

అరుదైన సంఘటనలో, ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సంయుక్త విలేకరుల సమావేశంలో పాత్రికేయుల నుంచి ప్రశ్నలు సంధించారు. ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కుల పరిరక్షణకు, వాక్ స్వాతంత్య్రాన్ని నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అమెరికా మీడియా అడిగిన ప్రశ్నకు మోదీ బదులిస్తూ ‘ప్రజాస్వామ్యం మన సిరల్లో నడుస్తోంది’ అని అన్నారు. దేశం మతం లేదా కుల ప్రాతిపదికన వివక్ష చూపదని నొక్కిచెప్పిన ప్రధానమంత్రి, బిజెపి యొక్క చాలా నొక్కిచెప్పబడిన నినాదం - సబ్కా సాథ్, సబ్కా వికాస్.

భారత్‌–అమెరికా సంబంధాల చరిత్రలో ఈ రోజుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయంచామన్నారు. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని ఫలవంతం చేయడానికి ఇరుదేశాల ప్రభాత్వాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఒక్కతాటిపైకి వచ్చి, కలిసి పనిచేసేలా అంగీకారానికి వచ్చామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం నేడు మరో కొత్త స్థాయికి చేరిందన్నారు.

ఉగ్రవాదం, తీవ్రవాదంపై భారత్, అమెరికా కలిసి పోరాడుతున్నాయని చెప్పారు. నూతన రంగాల్లో భారత్, అమెరికా కలిసి చేయాలన్నదే తన ఆకాంక్ష అని జో బైడెన్‌ వివరించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు. భారత్, అమెరికాకు అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దాపరికాలకు తావు లేదని, పరస్పరం చక్కగా గౌరవించుకుంటున్నాయని బైడెన్‌ తెలియజేశారు. ప్రతి పౌరుడికీ గౌరవం లభించాలన్నారు.

అమెరికా స్ఫూర్తితో సాహసోపేత నిర్ణయాలు
రక్షణ, అంతరిక్షం, ఇంధనం, ఆధునిక సాంకేతికత వంటి రంగాల్లో  వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో గురువారం అధికారిక చర్చలు జరిపారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీసు ఈ ముఖాముఖి సమావేశానికి వేదికగా మారింది. పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్‌–అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి బైడెన్‌ చేపట్టిన చర్యలను మోదీ ప్రశంసించారు.
చదవండి: H-1B Visa: ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌–1బీ వీసా రెన్యువల్‌ అక్కడే!


 

భారత్‌–అమెరికా ప్రజల మధ్యనున్న బలమైన అనుబంధమే ఇరు దేశాల నడుమ సంబంధాలకు అసలైన చోదక శక్తి అని పేర్కొన్నారు. నేడు భారత్‌–అమెరికా సముద్రాల లోతుల నుంచి ఆకాశం అంచుల దాకా, ప్రాచీన సంస్కృతి నుంచి ఆధునిక కృత్రిమ మేధ దాకా భుజం భుజం కలిపి ముందుకు సాగుతున్నాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో అమెరికా చూపుతున్న అంకితభావం తాము సాహసోపేత నిర్ణయాలు, చర్యలు తీసుకోవడానికి స్ఫూర్తినిస్తోందని వ్యాఖ్యానిచారు. మోదీ, బైడెన్‌ శ్వేతసౌధంలో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు కలిసి మాట్లాడుకున్నారు.

మోదీకి ప్రత్యేక విందు..
అగ్రరాజ్య పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్ష భవనంలో ఘనమైన స్వాగతం లభించింది. బుధవారం అమెరికా అధ్యక్షుడు జోసెఫ్‌ బైడెన్, ఆయన సతీమణి జిల్‌ ఎదురొచ్చి మరీ మోదీకి సాదర స్వాగతం పలికారు. ద్వారం వద్దే సరదాగా మాట్లాడుతూ ఫొటోలు దిగారు. తర్వాత శ్వేతసౌధంలోకి తోడ్కొని వెళ్లారు. వ్యక్తిగతంగా ప్రత్యేకమైన విందు ఇచ్చేందుకు అంతకుముందే మోదీని బైడెన్‌ దంపతులు ఆహ్వానించిన విషయం విదితమే. వైట్‌హౌజ్‌లో బైడెన్‌ కుటుంబసభ్యులతో మోదీ కాసేపు మాట్లాడారు. ‘ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొనడం ఇరుదేశాల గాఢమైన స్నేహబంధానికి సంకేతం’ అని భారత విదేశాంగ శాఖ ఒక ట్వీట్‌చేసింది.

తృణధాన్యాలు, మొక్కజొన్న పొత్తులు, పుచ్చకాయ, పుట్టగొడుగులు, మిల్లెట్‌ కేక్, స్ట్రాబెర్రీ కేక్‌ ఇలా భిన్న పదార్థాలతో వేర్వేరు వంటకాలను మోదీకి వడ్డించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ విందులో ముందుగా భారత పలు ప్రాంతాలను గుర్తుచేస్తూ అగ్రనేతలకు సంగీతం వినిపించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు జాక్‌ సులేవాన్, అజిత్‌ దోవల్‌లు పాల్గొన్నారు. మరోవైపు మోదీకి దాదాపు 400 మంది అతిథుల సమక్షంలో అధికారిక విందు ఇవ్వనున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement