Sakshi News home page

సేఫ్‌ కారిడార్‌లు ఎక్కడ? రష్యా-ఉక్రెయిన్‌ల తీరుపై భారత్‌ తీవ్ర అసంతృప్తి

Published Tue, Mar 8 2022 12:01 PM

India Displeasure With Sumi Safe Corridor For Students Evacuation - Sakshi

ఉక్రెయిన్‌లోని ఐదు ప్రధాన నగరాల్లో రష్యా బలగాలు కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నాం 12గం. 40ని. నుంచి విరమణ మొదలు కానుంది. రాజధాని కీవ్‌తో పాటు ఖార్కీవ్‌, మరియూపోల్‌, సుమీ, చెర్నీగోవ్‌ నగరాల నుంచి తరలింపునకు క్లియరెన్స్‌ ఇచ్చింది. అయితే.. మిగతా చోట్ల మాత్రం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 

సేఫ్‌ కారిడార్‌లపై భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. సుమీలో చిక్కుకుపోయిన 700 మంది భారతీయులను తరలించే ప్రక్రియ ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే  భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కోసం భారత్‌.. ఆపరేషన్‌ గంగ నిర్వహిస్తోంది. ఇందుకు పూర్తి సహకారం ఉంటుందని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌ సైతం ప్రధాని మోదీకి తెలిపాయి.

అయినప్పటికీ తరలింపు ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో ఇక్కడున్న వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అన్ని శత్రుత్వాలకు తక్షణం ముగింపు పలకాలని భారతదేశం నిరంతరం పిలుపునిస్తోంది. సామరస్యంగా శాంతిపూర్వక చర్చలతో ఈ సంక్షోభం ముగియాలని భారత్‌ భావిస్తోంది. భారతీయుల తరలింపు సురక్షితంగా జరగాలని మేం కోరుకుంటున్నాం. అని యూఎన్‌ అంబాసిడర్‌ టీఎస్‌ త్రిమూర్తి, భద్రతా మండలిలో ప్రసంగించారు.

సేఫ్‌కారిడార్‌ కోసం పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా.. ఇరువైపు సానుకూల స్పందన వచ్చినట్లే అనిపిస్తోందని, కానీ, అది కార్యరూపం దాల్చట్లేదని ఆందోళన వ్యక్తం చేశారాయన. భారత్‌తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రష్యా మరోసారి కాల్పుల విరమణ ఉపశమనం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయినా ఇవాళ(మంగళవారం) సుమీ నుంచి భారతీయ విద్యార్థులు, ఇతర దేశాల పౌరుల తరలింపు సురక్షితంగా పూర్తవుతుందేమో చూడాలి. 

సంబంధిత వార్త: సుమీ నుంచి తరలింపు.. అసలు సమస్యలు ఇవే!

Advertisement

What’s your opinion

Advertisement