అంతర్జాతీయ పర్యాటక సూచిలో...భారత్‌ డౌన్‌

25 May, 2022 06:00 IST|Sakshi

దక్షిణాసియాలో మాత్రం నంబర్‌వన్‌ 

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వెల్లడి 

దావోస్‌: ప్రపంచ దేశాలకు ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌ 54వ స్థానంలో నిలిచింది. 2019లో 46 స్థానాన్ని దక్కించుకున్న మన దేశం ఎనిమిది స్థానాలు తగ్గిపోయి 54వ స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ దక్షిణాసియాలో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో జపాన్‌ మొదటి స్థానంలో నిలిస్తే, ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్, ఇటలీలు నిలిచాయి.

ప్రయాణాలు, పర్యాటకం అనే అంశంలో రెండేళ్లకు ఒకసారి అధ్యయనం చేసి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. గత రెండేళ్లు కరోనాతో విలవిలలాడిపోయిన ప్రపంచ దేశాల్లో ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం గాడిన పడుతోందని, అయినా ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలే ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. మొత్తం 117 దేశాల్లో పర్యాటక రంగ పురోగతిని సమీక్షించి ఈ నివేదిక రూపొందించారు.

అమెరికా మినహా టాప్‌–10 జాబితాలో నిలిచినవన్నీ యూరప్, ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతానికి దేశాలే కావడం గమనార్హం. కరోనా సంక్షోభానికి ముందున్న పరిస్థితులు ఇంకా రానప్పటికీ అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా జరడం వల్ల ప్రజలు ధైర్యంగా ప్రయాణాలు చేయగలుగుతున్నారని,  ప్రకృతి అందాలున్న దేశాల్లో పర్యటకానికి అధిక డిమాండ్‌ ఏర్పడిందని  ఈ నివేదిక పేర్కొంది.   

మరిన్ని వార్తలు