India Fires On China For Blocking Terrorist Label For Sajid Mir - Sakshi
Sakshi News home page

ముంబై దాడుల ప్రధాన సూత్రధారికి అండగా నిలిచిన చైనా 

Published Wed, Jun 21 2023 12:52 PM

India Fires On China For Blocking Terrorist Label For Sajid Mir - Sakshi

న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనా మరోసారి భారత్ కు అడ్డంకిగా నిలిచింది. 26/11 ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్ ను నిషేధిత జాబితాలో చేర్చి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి భారత్ అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టనీయకుండా చైనా అడ్డుకుంది.

ముఖ్య సూత్రధారి.. 
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు సాజిద్ మీర్. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ప్రధాన పాత్ర పోషించి ఆ మారణకాండలో 166 మంది మరణానికి కారణమయ్యాడు. దీంతో సాజిద్ మీర్ ను నిషేదిత వ్యక్తుల్లో చేర్చాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అమెరికా అతడిపైన 5 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని కూడా ప్రకటించింది. 

తోడుదొంగలు.. 
ఒక పక్క భారత్, అమెరికా సాజిద్ కోసం గాలింపు చేస్తోంటే.. పాకిస్తాన్ మాత్రం సాజిద్ చనిపోయినట్టు కట్టుకథ సృష్టించింది. అమెరికా ఆధారాలు చూపించమని కోరగా ప్లేటు ఫిరాయించి అతడికి 8 ఏళ్ళు జైలు శిక్షను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా సాజిద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చేందుకు భారత్, అమెరికా సంయుక్తంగా ఒక ప్రతిపాదనను సిద్ధం చేశాయి.

కానీ ఐక్యరాజ్యసమితిలోని అల్ ఖైదా ఆంక్షల కమిటీ ముందు ఈ ప్రతిపాదన చేయనీయకుండా చైనా అడ్డుకుంది. ఉగ్రవాదుల్ని కాపాడే విషయంలో పాకిస్తాన్, చైనా రెండు దేశాలూ ఒక్కటే ధోరణితో వ్యవాహరిస్తున్నాయని, సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తోన్న ఇటువంటి వ్యక్తులను మనం నిషేధించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రమూకలను అణచడం కష్టమని తెలిపారు ఐక్యరాజ్యసమితి MEA జాయింట్ సెక్రెటరీ ప్రకాష్ గుప్తా.  

ఇది కూడా చదవండి: రన్నింగ్ ట్రైన్ నుండి జారిపడ్డ యువకుడు.. వైరల్ వీడియో    

Advertisement
Advertisement