తోకముడిచిన సోమాలియా పైరేట్లు | Sakshi
Sakshi News home page

తోకముడిచిన సోమాలియా పైరేట్లు

Published Sat, Jan 6 2024 4:06 AM

Indian Navy commandos thwarted commercial ship hijack attempt - Sakshi

న్యూఢిల్లీ: భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియా సరుకు నౌకను హైజాక్‌ చేసేందుకు సోమాలియా సముద్రపు దొంగలు చేసిన ప్రయత్నాన్ని భారత నేవీ కమాండోలు చాకచక్యంగా తిప్పికొట్టారు. అందులోని 15 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 21 మందిని కాపాడారు. ఎంవీ లిలా నార్‌ఫోక్‌ అనే ఓడను ఈ నెల 4వ తేదీన అరేబియా సముద్ర జలాల్లో ఉండగా సాయుధ దుండగులు హస్తగతం చేసుకున్నారు. ఆపదలో ఉన్నామని, ఆదుకోవాలంటూ ఓడ సిబ్బంది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైం ట్రేడ్‌ ఆపరేషన్స్‌(యూకేఎంటీవో)పోర్టల్‌కు సమాచారం అందించారు.

అందులో 15 మంది వరకు భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలియడంతో భారత నేవీ అప్రమత్తమైంది. ఆ ప్రాంతానికి ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌకను హుటాహుటిన పంపించింది. పైరేట్లను లొంగిపోవాలని హెచ్చరికలు చేస్తూ ఎంవీ లిలా నార్‌ఫోక్‌ను శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఐఎన్‌ఎస్‌ చెన్నై అడ్డగించింది. సుశిక్షితులైన కమాండోలతో కూడిన అత్యాధునిక గస్తీ హెలికాప్టర్‌ పి–81ను సైతం అధికారులు సిద్ధంగా ఉంచారు.

నౌకలోని పరిస్థితులను దగ్గర్నుంచి అంచనా వేసేందుకు అత్యాధునిక ఎంక్యూ9బీ ప్రిడేటర్‌ డ్రోన్‌ను రంగంలోకి దించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పైఅధికారుల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందగానే కమాండోలు ఎంవీ లిలా నార్‌ఫోక్‌లోకి మెరుపు వేగంతో ప్రవేశించారు. వారిని చూసి పైరేట్లు తోకముడిచారు. గస్తీ సిబ్బంది ఇచ్చిన గట్టి హెచ్చరికలతోనే వారు భయపడి, నౌకను హైజాక్‌ చేసే ప్రయత్నాన్ని విరమించుకుని, పలాయన మంత్రం పఠించారని నేవీ ప్రతినిధి కమాండర్‌ వివేక్‌ మధ్వాల్‌ చెప్పారు.

నౌకలో విద్యుత్‌ వ్యవస్థను, చోదక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. అన్నీ పూర్తయ్యాక నౌక ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించనుందన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల స్వేచ్ఛా యానానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ఇతర దేశాల భాగస్వామ్యంతో పనిచేసేందుకు నేవీ కట్టుబడి ఉంటుందని వివరించారు. సముద్ర దొంగల బారి నుంచి తమ నౌకను రక్షించిన భారత నేవీకి లిలా గ్లోబల్‌ సీఈవో స్టీవ్‌ కుంజెర్‌ ధన్యవాదాలు తెలిపారు. 

ఇలా ఉండగా, ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం నౌకా రవాణాపైనా పడింది. 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియాకు చెందిన ఎంవీ చెమ్‌ ప్లుటో నౌకపై డిసెంబర్‌ 23న భారత పశ్చిమ తీరంలో డ్రోన్‌ దాడి జరిగింది. భారత్‌ వైపు చమురుతో వస్తున్న మరో నౌకపై ఎర్ర సముద్రంలో డ్రోన్‌ దాడి జరిగింది. మాల్టాకు చెందిన ఎంవీ రుయెన్‌ అనే నౌకను పైరేట్లు డిసెంబర్‌ 14న హైజాక్‌ చేశారు.  

Advertisement
Advertisement