‘వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం’ | Sakshi
Sakshi News home page

‘వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం’

Published Sun, Mar 17 2024 9:06 PM

Israel PM Netanyahu says to continue Gaza offensive despite global pressure - Sakshi

గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం చేస్తున్న దాడులకు సంబంధించి ప్రపంచ దేశాల ఒత్తిడిని ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు తోసిపుచ్చారు. ఆదివారం ఆయన కేబినెట్‌ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లు తలొగ్గి మేము యుద్ధంలో మా లక్ష్యాన్ని మధ్యలో ఆపలేము. హమాస్‌ను అంతం చేయటం, బంధీలను విడిపించుకోవటం, గాజాలోని హమాస్‌కు వ్యతిరేకంగా పోరాటం విషయంలో ప్రపంచ దేశాల ఒత్తిడిని పట్టించుకోం. రఫా నుంచి దాడులు కొనసాగిస్తాం. మరికొన్ని వారాల పాటు దాడులు జరుపుతాం’ అని అన్నారు.

ప్రపంచ దేశాల ఒత్తిడిపై కూడా బెంజమిన్ నెతాన్యహు స్పందించారు. ‘మీకు జ్ఞపకశక్తి తక్కువగా ఉందా? అక్టోబర్‌7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన భీకరమైన దాడులు  అంత త్వరగా మర్చిపోయారా? హమాస్‌ వ్యతిరేకంగా పోరాడుతున్న ఇజ్రాయెల్‌ను ఇంత త్వరగా వ్యతిరేకిస్తారా?’ అని తీవ్రంగా మండిపడ్డారు. దాడుల సమయంలో రఫా నగరం నుంచి పౌరులను ఖాళీ చేయాలనే ప్రణాళికతో ఉన్నామని తెలిపారు. అయితే ఈ విషయంలో మిత్రదేశాలు ఇజ్రాయెల్‌పై సందేహం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు.

ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో 31,600 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. అక్టోబర్‌ 7న హమాస్ చేసిన మెరుపుదాడిలో 1200 మంది ఇజ్రాయెల్‌పౌరులు మృతి చెందారు. 253 మంది ఇజ్రాయెల్‌ పౌరులను హమాస్‌ బలగాలు బంధీలుగా తరలించుకుపోయిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement