గురి తప్పని జపాన్. బుల్లెట్ దింపిన మూన్ ‘స్నైపర్’! | Sakshi
Sakshi News home page

గురి తప్పని జపాన్. బుల్లెట్ దింపిన మూన్ ‘స్నైపర్’!

Published Sat, Jan 20 2024 5:15 AM

Japan SLIM spacecraft lands on moon - Sakshi

టోక్యో: తమ మానవరహిత అంతరిక్ష నౌక చంద్రమండలంపై దిగిందని జపాన్‌ అంతరిక్ష సంస్థ తెలిపింది. స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌(స్లిమ్‌) చంద్రుడి ఉపరితలంపై ఉదయం 12.20 గంటల సమయంలో దిగిందని పేర్కొంది. తాజా విజయంతో చంద్రుడిపైకి విజయవంతంగా అంతరిక్ష నౌకను పంపిన ఐదో దేశంగా జపాన్‌ అవతరించింది. అయితే.. ఆపరేషన్ సక్సెస్... కానీ పేషెంట్ డెడ్?

చంద్రుడిపై సాఫీగానే దిగిన జపాన్ ‘మూన్ స్నైపర్’. భూమ్మీది గ్రౌండ్ స్టేషనుతో సంబంధాలూ బాగానే ఉన్నాయ్. చావు కబురు చల్లగా తెలిసిందేమంటే... ల్యాండరులోని సౌరఘటాలు (సౌరఫలకాలు/సోలార్ ప్యానెల్స్) పనిచేయడం లేదట. అవి విద్యుదుత్పత్తి చేయడం లేదట. ప్రస్తుతం ‘స్లిమ్’ తన సొంత బ్యాటరీపైనే ఆధారపడుతోంది. ల్యాండర్ డేటా భూమికి ప్రసారమయ్యేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ‘జాక్సా’ సిబ్బంది. ‘స్లిమ్’ సొంత బ్యాటరీలో శక్తి అయిపోతే, ఈలోగా సౌరవిద్యుత్ అందుబాటులోకి రాకుంటే... ల్యాండర్ చెల్లుకున్నట్టే!

మిషన్ సఫలమా? విఫలమా? అనే విషయం పక్కనపెడితే... ‘మూన్ స్నైపర్’ ల్యాండింగులో జపాన్ వాడిని మెచ్చుకుని తీరాల్సిన అంశం ఒకటుంది. “రాజీపడి ఎక్కడపడితే అక్కడో, సులభంగా ఎక్కడో ఒకచోటనో దింపే టైపు కాదు జపాన్ వాడు. ఎక్కడ  దిగాలనుకుంటాడో వాడు అక్కడే దిగుతాడు”. సాధారణంగా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు శాస్త్రవేత్తలు ముందుగా నిర్దేశించిన ప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్ల వైశాల్యంలో వీలునుబట్టి, సురక్షితం అనుకున్న ఎక్కడో ఒకచోట దిగుతాయి. మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండరుకు సైతం ఇస్రో 4 కి.మీ. X 2.4 కి.మీ. విస్తీర్ణమున్న ప్రదేశాన్ని ఎంపిక చేసింది. అంటే... అంత పెద్ద ఏరియాలో అది ఎక్కడో ఒకచోట దిగిందన్నమాట.

కానీ ఇప్పుడు జపాన్ అలా కాదు. చుక్కపెట్టి గురి తప్పకుండా కొట్టింది. చంద్రుడిపై జపాన్ కేవలం 100 మీటర్ల వ్యాసంతో ఓ గిరి గీసింది. కచ్చితంగా అదే గిరిలో ల్యాండరును క్షేమంగా దింపింది. ఇదే ప్రెసిషన్ ల్యాండింగ్. పిన్ పాయింట్ ల్యాండింగ్. అంతరిక్షంలో ఇలాంటివి అనితర సాధ్యం.

ప్రపంచవ్యాప్త వార్తాసంస్థలు, ఇతర పత్రికలు మనకేల? తమ అంతరిక్ష విజయం గురించి అని పట్టించుకోకపోపయినా.. ‘The Japan Times’ పత్రిక ఏం రాసిందో చూద్దాం. చంద్రుడి ఉపరితలంపై దిగేటప్పుడు జపాన్ ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ ఏమీ దెబ్బతినలేదు. కనుక... బహుశా దాని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) సైతం పాడవకుండా భేషుగ్గానే ఉండి ఉంటాయి. కాకపోతే... తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల సౌరశక్తిని వ్యోమనౌక వినియోగించుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆన్‌బోర్డ్‌ బ్యాటరీపై అది ఆధారపడుతోంది. కొన్ని గంటలపాటు మాత్రమే ఆ బ్యాటరీ పవర్ అందించగలదు. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? ఓ ఆశ మిణుకుమిణుకుమంటోంది! ‘మూన్ స్నైపర్’ సౌర ఫలకాలు సూర్యుడి దిశగా లేవని ‘జాక్సా’ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సూర్యుడి దిశ (కోణం) మారగానే అవి సౌర విద్యుత్ తయారు చేస్తాయనేది వారి వాదన. ఒకసారి సోలార్ ప్యానెల్స్ సరిగా పని చేయడమంటూ మొదలైతే ల్యాండర్ కొన్ని రోజులపాటు జీవించి అప్పగించిన విధులు నిర్వర్తిస్తుంది. అనంతరం కొన్ని రోజులకు సోలార్ ప్యానెల్స్ పాడవుతాయి. ఎందుకంటే... చంద్రుడిపై పగటి వేళలో నమోదయ్యే 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు అవి క్రమంగా నాశనమవుతాయి. ఏదేమైనా ఈ ల్యాండింగ్ జపాన్ అంతరిక్ష కార్యక్రమానికి గొప్ప ఊపు, ఉత్తేజాలనిచ్చింది.
-జమ్ముల శ్రీకాంత్

Advertisement
Advertisement