జో బైడెన్‌కు నిరసన సెగ.. ‘ఓటు వెయ్యం’ అంటూ నినాదాలు

13 Jan, 2024 12:22 IST|Sakshi

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రచారంలో నిరసన సెగ తగిలింది. గాజాలో భీకరమైన దాడులకు తెగబడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా శుక్రవారం పెన్సిల్వేనియాలో జో బైడెన్‌ పర్యటించారు. అయితే ఇజ్రాయెల్‌కు బైడెన్‌ మద్దతు ఇవ్వటంపై ఆగ్రహంతో ఉన్న అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలు ‘విధ్వంసకర జో’కు తాము ఓటు వేయబోమని నినాదాలు చేశారు.

అధ్యక్షుడు జో బైడెన్‌ ఒక ‘ఓడిపోయిన వ్యక్తి’ అని అతను ఇక ఇంటికి వెళ్లిపోవాల్సిందేనని మండిపడ్డారు. దీంతో ఏం చేయలేక అధ్యక్షుడు జో బైడెన్‌ పెన్సిల్వేనియా నుంచి వెనుదిరిగినట్టు తెలుస్తోంది. 2024లో జో బైడెన్‌ చేపట్టిన మొదటి ప్రచారంలోనే ఇలా నిరసన ఎదుర్కోవటం గమనార్హం. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా క్షీణిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో 14 మిలియన్ల ఉద్యోగాలు సృష్టిస్తాన్న జో బైడెన్‌ హామీ ఇంకా నెరవేరలేదు. ఇప్పటికైనా అమెరికా ప్రజలు, కార్మికుల ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉంది.

రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో 81 ఏళ్ల జో బైడెన్‌, ప్రతిపక్ష నేత  డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే కూడా తక్కువ అప్రూవల్‌ రేటింగ్‌ను పొందుతున్నారు. అమెరికాలోని నల్లజాతి, కొ​న్నిమైనార్టీల  ఆదరణను క్రమంగా జో బైడెన్‌ కోల్పోతున్నట్లు తెలుస్తోంది. 2020లో జో బైడెన్‌ గెలవడానికి సహకరించిన ఈ వర్గాలు ప్రస్తుతం జో బైడెన్‌ పాలనపై అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక.. నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
చదవండి:    ఎన్నికల సంఘ బాధ్యతలను మేము తీసుకోబోం

>
మరిన్ని వార్తలు