గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. అంతలోనే | Sakshi
Sakshi News home page

గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. రెండు నెలల్లోనే

Published Tue, Mar 5 2024 6:38 PM

Kerala Man Killed In Israel Leaves Behind Pregnant Wife Daughter - Sakshi

ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రయెల్‌పై సోమవారం ఓ క్షిపణి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌- లెబనాన్‌ సరిహద్దుల్లో జరిగిన ఈ దాడి.. లెబనాన్‌కు చెందిన హెజ్జుల్లా మిలిటెంట్‌ గ్రూప్‌ పనిగా తేలింది.   

ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దులోని మార్గాలియోట్‌ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఓ భారతీయుడు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.  ముగ్గురే కేరళకు చెందిన వారే కావడం గమనార్హం. మరణించిన వ్యక్తిని కేరళలోని కొల్లంకు చెందిన  పాట్‌ నిబిన్‌ మాక్స్‌మెల్‌గా గుర్తించగా.. గాయపడిన ఇద్దరిని జోసెఫ్‌ జార్జ్‌, పాల్‌ మెల్విన్‌లుగా గుర్తించారు, ఇద్దరు ఇడుక్కికి చెందగా..ప్రస్తుతం  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కాగా 31 ఏళ్ల పాట్‌ నిబిన్‌ రెండు నెలల కిత్రమే ఇజ్రాయెల్‌ వెళ్లారు. అతడి భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. వీరికి అయిదేళ్ల  కూతురు కూడా ఉంది. అయితే తన భర్త, తండ్రికి అవే చివరి చూపులు అవుతాయని ఇద్దరూ ఊహించి ఉండరేమో..

ఈ దాడిపై నిబిన్‌ తండ్రి పాథ్రోస్‌ మాట్లాడుతూ.. తన పెద్ద కొడుకు ఇజ్రాయెల్‌ వెళ్లడంతో చిన్న కుమారుడైన నిబిన్‌ కూడా వారం రోజుల వ్యవధిలోనే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ముందు మస్కట్‌, దుబాయ్‌ వెళ్లి ఇంటికి వచ్చిన అతడు అనంతరం రెండు నెలల కిత్రం ఇజ్రాయెల్‌ వెళ్లినట్లు తెలిపారు. తన కోడలు ద్వారా కొడుకు మృతి చెందినట్లు తెలిసినట్లు చెప్పారు.

‘సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె నాకు ఫోన్ చేసి, నిబిన్ దాడిలో గాయపడి ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. తరువాత అర్ధరాత్రి 12.45 గంటలకు, అతను మరణించినట్లు మాకు సమాచారం వచ్చింది.  నిబిన్ నాలుగున్నరేళ్ల కుమార్తెను, అతని భార్య(ఏడు నెలల గర్భవతి)ని వదిలి ఇజ్రాయెల్‌ వెళ్లాడు. అన్ని లాంఛనాలు పూర్తయ్యాక  నిబిన్ మృతదేహాన్ని నాలుగు రోజుల్లో కేరళకు తీసుకురానున్నారు’ అని పేర్కొన్నారు.

భారత్‌ అడ్వైజరీ జారీ
ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంలో  తొలిసారి భారతీయ వ్యక్తి మరణించడంతో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు.. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ అధికారులతో సంప్రదింపులు జరిపి.. భద్రత కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఖండించిన ఇజ్రాయెల్‌
ఈ దాడిని భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం ఖండించింది. పండ్లతోటను సాగు చేస్తున్న  వ్యవసాయ కార్మికులపై షియా ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా జరిపిన ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలోన్ మాక్స్‌వెల్ సోదరుడితో మాట్లాడి, అతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంది.

Advertisement
Advertisement