London Police Arrested Man Throwing Things At Buckingham Palace - Sakshi
Sakshi News home page

ఛార్లెస్‌ పట్టాభిషేకం వేళ లండన్‌లో కలకలం.. బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వద్ద భద్రతా లోపం

Published Wed, May 3 2023 8:32 AM

London Police Arrested Man Throwing Things At Buckingham Palace - Sakshi

లండన్‌: కింగ్‌ ఛార్లెస్‌ పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గర పడుతున్న వేళ.. లండన్‌ బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ప్యాలెస్‌ గేటు వద్దకు చేరుకున్న ఓ వ్యక్తి..  ప్యాలెస్‌ మైదానంలోకి  కొన్ని వస్తువులను విసిరేశాడు. అందులో తుపాకీ మందుగుండు shotgun cartridges కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ నెల 6వ తేదీన కింగ్‌ ఛార్లెస్III పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గుర్తు తెలియని ఓ వ్యక్తి.. భారీ భద్రతను దాటుకుని గేట్‌ వద్దకు చేరుకున్నాడు. తన బ్యాగులో ఉన్న వస్తువులను ప్యాలెస్‌ వైపు విసరడం ప్రారంభించాడు. అయితే అవి ప్యాలెస్‌ గ్రౌండ్‌లో పడిపోయాయి.  సకాలంలో గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌ చీఫ్‌ వెల్లడించారు.  అయితే ఆ బ్యాగులో ఓ ఆయుధం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులు లాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని, ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు? అలా చేశాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. 

ఆగంతకుడి దాడి సమయంలో.. ఛార్లెస్‌(74), ఆయన భార్య కామిల్లా(75) ప్యాలెస్‌లోనే ఉన్నారా? అనేదానిపై బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వర్గాలు స్పందించ లేదు. శనివారం జరగబోయే పట్టాభిషేక మహోత్సవం కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్‌కు వెళ్లే దారులను జల్లెడ పడుతూ.. కొన్ని మాల్స్‌ను తాత్కాలికంగా మూయించేస్తున్నారు. 

దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ బ్రిటన్‌లో పట్టాభిషేకం జరుగుతోంది. కిందటి ఏడాది క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణించగా.. ఆమె తనయుడు ఛార్లెస్‌(Charles 3)ని రాజుగా ప్రకటించింది రాజప్రసాదం. అయితే పట్టాభిషేకం మాత్రం దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు జరుగుతోంది.  సెంట్రల్ లండన్ మీదుగా నో-ఫ్లై జోన్‌ను ప్రకటించడంతో పాటు రూఫ్‌టాప్ స్నిపర్‌, రహస్య అధికారులు, అలాగే ఎయిర్‌పోర్ట్-స్టైల్ స్కానర్‌లు, స్నిఫర్ డాగ్‌లతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 

ఇదీ చదవండి: 18 ఏళ్లుగా ఒక్క మరక కూడా లేకుండా.. 

Advertisement

తప్పక చదవండి

Advertisement