పపువా న్యూగినీలో అల్లర్లు.. | Sakshi
Sakshi News home page

పపువా న్యూగినీలో అల్లర్లు..

Published Fri, Jan 12 2024 5:34 AM

Major rioting in Papua New Guinea as police strike over missing pay - Sakshi

పోర్ట్‌ మోర్స్‌బీ: పసిఫిక్‌ ద్వీప దేశం పపువా న్యూగినీ అల్లర్లతో అట్టుడుకుతోంది. వేతనాల్లో కోతకు నిరసనగా పోలీసులు సమ్మెకు దిగడంతో జనం దుకాణాలు, కార్లకు నిప్పుపెట్టారు. సూపర్‌మార్కెట్లను దోచుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, అధిక ధరలు ఆకాశాన్నంటడంతో అసంతృప్తితో జనం రగిలిపోతున్నారు. బుధవారం పోలీ సులు, ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు పార్లమెంట్‌ ఎదుట నిరసనకు దిగారు.

వేతనాల్లో 50 శాతం వరకు కోతపెట్టడాన్ని నిరసించారు. అయితే, కంప్యూటర్‌లో పొర పాటు కారణంగానే వేతనంలో కోత పడిన ట్లు ప్రధాని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఆందోళనకారులు పార్లమెంట్‌ భవనం లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆవరణలోని కారుకు నిప్పుపెట్టారు. గేటును విరగ్గొట్టారు. అనంతరం సాధారణ ప్రజానీకం వారికి తోడైంది. అందరూ కలిసి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు.

ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో రాజధానిలో 8 మంది, దేశంలోని రెండో అతిపెద్ద లే నగరంలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని పోర్ట్‌ మోర్స్‌బీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదనంగా బలగాలను రప్పించారు. 14 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి జేమ్స్‌ మరపీ ప్రకటించారు. బుధవారం సాయంత్రానికే పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు ప్రధాని చెప్పారు. సోషల్‌ మీడియా లో అసత్యాల ప్రచారమే పరిస్థితికి కారణ మని నిందించారు. పోలీసులు లేకపో వడంతో అవకాశవాదులు రెచ్చిపోయారన్నారు.

Advertisement
Advertisement