లక్‌ అంటే నీదే నిక్‌, కోట్ల లాటరీ మళ్లీ దొరికింది

23 Mar, 2021 10:26 IST|Sakshi

వాషింగ్టన్‌: లాటరీ తగలడం మమూలు విషయం కాదు. వేలల్లో, లక్షల్లో ఉండే పోటీ దారుల్లో మనకు అదృష్టం వరించినట్టు. ముఖ్యంగా చిన్నా చితకా లాటరీ అయితే, విశేషం ఏమీ ఉండదు. కానీ కోట్ల రూపాయల లాటరీ తగలడం మాత్రం పెద్ద విశేషమే. అయితే, ఆ తగిలిన లాటరీ టికెట్‌ ఎక్కడో పోగొట్టుకుని, తిరిగి పొందడం మాత్రం లక్కే. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. ఓ వ్యక్తి లాటరీలో 1.2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 8.67 కోట్లు) గెలుచుకొని టికెట్‌ పోగొట్టుకున్నాడు. అదృష్టం బాగుండి పోయిన టికెట్‌ దొరికింది.

వివరాల్లోకి వెళితే... అమెరికాలోని టేనస్సీ రాష్ట్రానికి చెందిన నిక్ స్లాటెన్ (31) మార్చి 10న గ్రాసరీ స్టోర్‌లో లాటరీ టికెట్ కొన్నాడు. మరుసటి రోజు ఉదయం... స్లాటెన్‌ తీసుకున్న టిక్కెట్టు లాటరీలో ఎంపికైంది. తాను గెలుచుకున్న లాటరీ టికెటు నగదు బహుమతిని తీసుకెళ్దామనే లోపు, నిక్‌ టిక్కెట్‌ కనిపించకుండా పోయింది. దీంతో నిక్‌ నిరాశలో మునిగిపోయాడు. అదృష్టం ఇలా తలుపు తట్టినట్టే తట్టి అలా వెళ్లిపోయిందని బాధపడ్డాడు. టికెట్‌ కోసం ఇళ్లంతా వెతికినా లాభం లేకపోయింది. కానీ అతని లక్కు కాసేపటికే కంటపడింది. పోగొట్టుకున్న లాటరీ టికెట్‌.. అదృష్టంకొద్ది తాను వెళ్లేదారిలో దొరికింది. దీంతో నిక్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా ఒక్క రోజు వ్యవధిలోనే జరిగింది. మనది అని రాసి పెట్టి ఉండాలే గానీ, దక్కక మానదు అనేందుకు ఈ ఘటనే ఉదాహరణ.

(చదవండి: అమెరికా: సూపర్‌ మార్కెట్‌లో కాల్పులు..10 మంది మృతి)

మరిన్ని వార్తలు