మయన్మార్‌లో ఆగని అరాచకం.. 550 మంది మృతి

4 Apr, 2021 20:29 IST|Sakshi

యాంగాన్‌: మయన్మార్‌లో మిలటరీ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. నిరసనకారుల్ని అణిచివేయడానికి సైన్యం ప్రతీ రోజూ కాల్పులకు దిగుతోంది. శనివారం సైన్యం కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు బలయ్యారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అందులో కొంతమంది తల నుంచి రక్తం ధారగా కారుతున్న ఒక యువకుడిని తీసుకొని పరుగుల తీస్తున్న దృశ్యంతో పాటు కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఫిబ్రవరి 1న అంగసాన్‌ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దింపిన తర్వాత మిలటరీ కాల్పుల్లో ఇప్పటివరకు 550 మంది ప్రాణాలు పోయాయని స్థానిక హక్కుల సంస్థ వెల్లడించింది.

మరణించిన వారిలో 46 మంది చిన్నారులు ఉండడం తీవ్రంగా కలకలం రేపే అంశం. మయన్మార్‌ అసిస్టెన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2,751 మందిని సైన్యం అదుపులోనికి తీసుకొని జైలు పాలు చేసింది. మిలటరీ ప్రజా ఉద్యమాన్ని ఎంతలా అణగదొక్కాలనుకుంటుందో అంతే బలంగా అది పైకి లేస్తోంది. మిలటరీ తూటాలకు భయపడేది లేదంటున్న ప్రజలు రోడ్లపైకి వచ్చి మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు.

అందరిపైనా తుపాకీ గురి పెడుతున్నారు 
ఇల్లు దాటి బయటకి వచ్చిన ప్రతీ ఒక్కరిపైనా మయన్మార్‌ సైనికులు తుపాకీ గురి పెడుతున్నట్టుగా సీఎన్‌ఎన్‌ చానెల్‌కి కొందరు నిరసనకారులు చెప్పారు. ‘‘దుకాణాలకి వెళ్లినా, రోడ్డుపై నడిచి వెళుతున్నా సైనికులు పిస్టల్‌ని గురి పెట్టి బెదిరిస్తున్నారు. ఎవరైనా సాయం కోరినా అందించే పరిస్థితి లేదు’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా మిలటరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మైనార్టీ రెబెల్‌ గ్రూపు కరేన్‌ నేషనల్‌ యూనియన్‌ తమకు పట్టున్న గ్రామాలపై మిలటరీ నిరంతరాయంగా బాంబుల వర్షం కురిపిస్తోందని తెలిపింది.

చదవండి:

తల్లి టీవీ ఆఫ్‌ చేసిందని కొడుకు ఆత్మహత్య

ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు