Narendra Modi Is A India's Hero Says Indian Community Members In Egypt, Details Inside - Sakshi
Sakshi News home page

PM Modi Egypt Tour: ఇండియా హీరో మోదీ

Published Mon, Jun 26 2023 4:45 AM

Narendra Modi is a India her Says Indian community members in Egypt - Sakshi

కైరో:  ‘ఇండియా హీరో నరేంద్ర మోదీ’ అంటూ ఈజిప్టులో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ చరిత్రాత్మక ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఇండియా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటన ముగించుకొని శనివారం ఈజిప్టులో అడుగుపెట్టారు. గత 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడంఇదే మొదటిసారి. రాజధాని కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిట్జ్‌ కార్ల్‌టన్‌ హోటల్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఇండియా హీరో(కథానాయకుడు) మీరేనంటూ వారు ప్రశంసించగా మోదీ ప్రతిస్పందించారు. అందరికీ హీరో ఇండియా అని బదులిచ్చారు. ప్రజలంతా కష్టపడి పనిచేస్తున్నారని, అందుకే మన దేశం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు.

దేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందని చెప్పారు. దేశ విజయంలో వారికి సైతం వాటా దక్కుతుందన్నారు. అనంతరం దావూదీ బోహ్రా వర్గం ముస్లింలతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుజరాత్‌లోని దావూదీ బోహ్రా ముస్లింలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.  ఈజిప్టులో ప్రవాస భారతీయులు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. వారి ఆప్యాయత తన హృదయాన్ని కదిలించిందని పేర్కొన్నారు. ఈజిప్టువాసులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి తనకు స్వాగతం పలికారని వెల్లడించారు. భారత్‌–ఈజిప్టు దేశాలు సంప్రదాయాలను సైతం పంచుకుంటున్నాయని వివరించారు.  

అల్‌–హకీం మసీదు, గ్రేట్‌ పిరమిడ్ల సందర్శన  
ఈజిప్టులో 11వ శతాబ్దం నాటి చరిత్రాత్మక అల్‌–హకీం మసీదును ప్రధాని మోదీ సందర్శించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు చేసిన ప్రాణత్యాగాలకు గుర్తుగా నిర్మించిన హెలియోపోలిస్‌ కామన్‌వెల్త్‌ వార్‌ మెమోరియల్‌ను సందర్శించి, ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.

ఈజిప్టులో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 3,799 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన గిజా గ్రేట్‌ పిరమిడ్లను మోదీ సందర్శించారు. కైరో నగర శివార్లలో గిజా నెక్రోపోలిస్‌ అనే ప్రాంతంలో ఈ పిరిమిడ్లు ఉన్నాయి. ‘‘కైరో అల్‌–హకీం మసీదును సందర్శించడం ఆనందంగా ఉంది. ఈజిప్టు ఘనమైన వారసత్వానికి, సంస్కృతికి ఈ మసీదు దర్పణం పడుతోంది’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.  

అవగాహనా ఒప్పందాలపై సంతకాలు  
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనే దిశగా భారత్, ఈజిప్టు మరో అడుగు వేశాయి. భారత ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సీసీ ఆదివారం చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరువురు నేతలు నాలుగు అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)పై సంతకాలు చేశారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా చెప్పారు. ఇందులో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందం ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రాచీన, పురావస్తు కట్టడాల పరిరక్షణ, ‘కాంపిటీషన్‌ లా’కు సంబంధించిన మరో మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారని తెలిపారు.   

మోదీకి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద నైలు’ ప్రదానం  
ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద నైలు’ను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సీసీ ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈజిప్టు సహా ఇప్పటిదాకా 13 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో మోదీని సత్కరించాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, మాల్దీవ్స్, రష్యా, బహ్రెయిన్, పపువా న్యూగినియా, ఫిజీ, రిపబ్లిక్‌ ఆఫ్‌ పాలౌ, భూటాన్‌ తదితర దేశాల నుంచి ఆయన ఈ పురస్కారాలు స్వీకరించారు. తనకు ఆర్డర్‌ ఆఫ్‌ ద నైలు పురస్కారం ప్రదానం చేసిన ఈజిప్టు ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్‌ పట్ల ఈజిప్టు ప్రజల ఆప్యాయత అనురాగాలకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement