Netherlands: Dutch Coalition Government Collapses Over Migration Issue, PM Mark To Leave Politics - Sakshi
Sakshi News home page

Dutch Govt Collpase: ప్రభుత్వాన్నే ముంచేసిన.. వలసల వరద..

Published Thu, Jul 13 2023 4:53 AM

Netherlands: Dutch Coalition Government Collapses Over Migration Issue - Sakshi

నెదర్లాండ్స్‌లో నాలుగు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికైన ఏడాదిన్నరకే పేకమేడలా కుప్పకూలింది. యూరప్‌లో చాలా దేశాలు ఎదుర్కొంటున్న వలసల ఉధృతే ఇందుకు ప్రధాన కారణం కావడం అక్కడ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది..

నెదర్లాండ్స్‌లోకి వలసలను కట్టడి చేసేందుకు ప్రధాని మార్క్‌ రుట్టె ప్రతిపాదించిన కఠినతరమైన వలసల విధానం చివరికి ఆయన ప్రభుత్వానికే ఎసరు తెచి్చంది. పాలక సంకీర్ణంలోని మిగతా మూడు భాగస్వామ్య పార్టీలూ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో రుట్టె రాజీనామా చేశారు. అయితే, భాగస్వాముల మాటకు తలొగ్గి రాజీ పడేకంటే దీర్ఘకాలిక స్వీయ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న దూరదృష్టి ఆయన నిర్ణయంలో ప్రతిఫలించిందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేగాక యూరప్‌లో వలసల సమస్య నానాటికీ ఎంత తీవ్రతరంగా మారుతోందో, అక్కడి రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తోందో, దీన్ని రైట్‌ వింగ్‌ పార్టీలు సొమ్ము చేసుకోకుండా ఆపడం ప్రధాన పార్టీలకు ఎంత కష్టతరంగా పరిణమిస్తోందో ఈ ఉదంతం మరోసారి తేటతెల్లం చేసిందని చెబుతున్నారు.

► యూరప్‌లోని అత్యంత ధనిక దేశాల్లో నెదర్లాండ్స్‌ది నాలుగో స్థానం
► నెదర్లాండ్స్‌లోకి వలసల సంఖ్య గతేడాది ఏకంగా మూడో వంతు పెరిగి 47 వేలు దాటేసింది! దాంతో ప్రధాని రుట్టె కట్టడి చర్యలను ప్రతిపాదించాల్సి వచి్చంది.
► ఈసారి దేశంలోకి శరణార్థుల సంఖ్య ఏకంగా 70 వేలు  దాటొచ్చని అంచనా.
► వలసదారుల దెబ్బకు చాలా యూరప్‌ దేశాల్లో మాదిరిగానే నెదర్లాండ్స్‌లో కూడా ఇళ్ల ధరలు, అద్దెలు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
► ఇదేగాక పెరుగుతున్న వలసల వల్ల అనేకానేక సమస్యలతో నెదర్లాండ్స్‌ సతమతమవుతోంది.
► నవంబర్‌లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ఇది అది పెద్ద ప్రచారాంశంగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
► ఇప్పుడిక నెదర్లాండ్స్‌ రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.  


ఏమిటీ ప్రతిపాదిత విధానం...
ప్రధానంగా, నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న వలసదారుల పిల్లలకు వలసదారులుగా గుర్తింపు ఇచ్చేందుకు కనీసం రెండేళ్ల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండాలని ప్రధాని రుట్టె ప్రతిపాదించారు. దీన్ని సంకీర్ణ భాగస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు.

యూరప్‌కు పెనుభారంగా వలసలు...
► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర కారణాలతో యూరప్‌ దేశాలకు కొన్నేళ్లుగా వలసలు భారీగా పెరుగుతున్నాయి.
► 2015లో సిరియా నుంచి శరణార్థులు వెల్లువెత్తిన నాటి నుంచీ ఈ ధోరణి నానాటికీ పెరుగుతూనే ఉంది.
► కానీ ద్రవ్యోల్బణం తదితరాలతో అసలే ధరాభారం, జీవన వ్యయం నానాటికీ పెరిగిపోతున్న సమయంలో ఈ వలసలు క్రమంగా యూరప్‌ దేశాలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి.
► దీన్ని అవకాశంగా మలచుకుంటూ పలు యూరప్‌ దేశాల్లో రైట్‌ వింగ్‌ పార్టీలు శరణార్థుల పక్షం వహిస్తుండటంతో యూరప్‌ రాజకీయాలే కీలకమైన, అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి కూడా.
► ఏళ్లుగా పాతుకుపోయిన సంప్రదాయ పార్టీలకు ఈ రైట్‌ వింగ్‌ పార్టీల ఎదుగుదల పెను సవాలుగా మారుతోంది.
► జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, హంగరీ మొదలుకుని చిన్నా పెద్దా యూరప్‌ దేశాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి!
► దాంతో రైట్‌ వింగ్‌ పార్టీలకు ముకుతాడు వేసేందుకు సంప్రదాయ పార్టీలన్నీ చేతులు కలుపుతున్న కొత్త ధోరణి కూడా కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలైంది.


రుట్టె కేంద్రంగా...
► నెదర్లాండ్స్‌లో వలసలపై నెలకొన్న తాజా సంక్షోభం ప్రధాని రు ట్టె సంప్రదాయ వైఖరి కారణంగానే ముదురు పాకాన పడింది.
► 13 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రుట్టె, దీన్ని కూడా అందివచి్చన అవకాశంగానే మలచుకుని వెంటనే రాజీనామా చేశారు.
► ఇటీవల బలం పుంజుకుంటున్న రైట్‌వింగ్‌ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అధికారాన్ని కూడా తృణప్రాయంగా వదులుకున్నారన్న ఇమేజీ సాధించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టే లక్ష్యంతోనే ఆయన రాజీనామా చేసినట్టు కనిపిస్తోంది.
► రైట్‌ వింగ్‌ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా రుట్టె తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు.
► అంతేగాక రాజీనామా ద్వారా యూరప్‌ యవనికపై వలసల కట్ట డి కోసం గళమెత్తుతున్న బలమైన నేతగా రుట్టె ఆవిర్భవించారు.
► యూరప్‌లోకి వలసల కట్టడికి సంయుక్త ఈయూ బోర్డర్‌ ఏజెన్సీ వంటివాటి ఏర్పాటును కూడా కొంతకాలంగా ఆయన ప్రతిపాదిస్తున్నారు.  అయితే రాజీనామా ద్వారా దేశ ప్రయోజనాల కంటే స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేసుకున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి!


‘కేవలం ప్రతిపాదిత వలస విధానంపై విభేదాల వల్ల ఏకంగా పాలక సంకీర్ణమే కుప్పకూలడం నమ్మశక్యం కాని నిజం! ఏదేమైనా రాజీనామా నిర్ణయం ప్రధాని రుట్టె
రాజకీయ చతురతకు అద్దం పట్టింది’

– మార్సెల్‌ హనెగ్రాఫ్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ పొలిటికల్‌ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్‌ ఆమ్‌స్టర్‌డామ్‌

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement