Sakshi News home page

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌పై నానో కత్తి

Published Fri, Jan 7 2022 4:39 AM

NHS introduces pioneering Nanoknife prostate cancer treatment - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మగవారికి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ శాపంగా పరిణమిస్తోంది. దీన్ని గుర్తించిన తర్వాత రేడియో థెరపీ లేదా ఆపరేషన్‌ చేసి ప్రొస్టేట్‌ గ్రంధిని తొలగించడమనే మార్గాలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి.  అయితే తాజాగా దీన్ని పూర్తిగా నిర్మూలించే సరికొత్త చికిత్సా విధానంపై డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంటలోపు పూర్తయ్యే ఈ చికిత్స ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నయం చేస్తుందంటున్నారు.

ఈ చికిత్సలో మందులకు లొంగని కణతులపైకి ఎలక్ట్రిక్‌ తరంగాలను పంపి వాటిని నాశనం చేస్తారు. ‘నానో నైఫ్‌’గా పిలిచే ఈ సరికొత్త చికిత్సా విధానం చాలా సులువైనదని, సైడ్‌ ఎఫెక్టులు చాలా స్వల్పమని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ హాస్పిటల్‌ సర్జన్లు చెప్పారు. నిజానికి ఈ నానో నైఫ్‌ చికి త్సను ఇప్పటికే లివర్, క్లోమ క్యాన్సర్లలో వాడుతున్నారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌పై దీన్ని తొలిసారి వాడినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

ఏమిటీ నానో నైఫ్‌..
ఈ ట్రీట్‌మెంట్‌ పేరు నానో నైఫ్‌ కానీ, నిజంగా చికిత్సలో నైఫ్‌ (కత్తి) వాడరు. చర్మం ద్వారా ఒక సూదిని పంపి ఆల్ట్రాసౌండ్స్‌ను ఉపయోగించి కణతులను (ట్యూమర్లు) గుర్తిస్తారు. అనంతరం ఆ కణితి చుట్టూ నాలుగు సూదులు గుచ్చుతారు. వీటి ద్వారా నానో నైఫ్‌ మిషన్‌ ఎలక్ట్రిక్‌ తరంగాలను పంపుతుంది. ఈ తరంగాలు కణతుల్లోని కణాలపై ఉండే  త్వచాన్ని ధ్వంసం చేస్తాయి. దీంతో ఆ కణుతులు నాశనం అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ 45–60 నిమిషాల్లో పూర్తవుతుంది. లకి‡్ష్యత కణుతులపైకి కరెంట్‌ తరంగాలను పంపి నిర్వీర్యం చేసే ఈ పద్దతిని ఇర్రివర్సబుల్‌ ఎలక్ట్రోపోరేషన్‌ అంటారు. దీనివల్ల కణతులకు చుట్టుపక్కల కణజాలంపై పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుంది. సాంకేతికత సాధించిన విజయాల్లో ఇది ఒకటని ఈ ఆపరేషన్‌ తొలిసారి నిర్వహించిన డాక్టర్‌ ఆలిస్టర్‌ గ్రే అభిప్రాయపడ్డారు.     

ముదిరితే కానీ తెలియదు..
మగవారిలో మూత్రాశయం దిగువన ఉండే ప్రొస్టేట్‌ గ్రంధిలో కణజాలం అదుపుతప్పి పెరగడాన్ని ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంభవించే క్యాన్సర్లలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది. మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఎంత ప్రమాదకరమో, పురుషుల్లో ఈ క్యాన్సర్‌ అంతే ప్రమాదకారిగా మారింది. ఏటా లక్షలమంది దీని బారినపడి మరణిస్తున్నారు. ఇతర క్యాన్సర్లలో కనిపించినట్లు ఈ క్యాన్సర్‌ సోకగానే లక్షణాలు కనిపించవు. దీంతో చాలామందిలో ఇది సోకిన విషయం చివరి దశలో కానీ బయటపడదు. మూత్ర విసర్జనలో ఇబ్బంది అనిపిస్తే డాక్టర్లు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌గా అనుమానిస్తారు.

బయాప్సీ ద్వారా ఈ క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. రేడియోథెరపీ నిర్వహించడం, ఆపరేషన్‌తో కణుతులను తొలగించడం వంటి చికిత్సామార్గాలున్నాయి. అయితే వీటితో సైడ్‌ ఎఫెక్టులు ఎక్కువ. ఇండియాలో ఏడాదికి సుమారు లక్షకుపైగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 85 శాతం కేసులు 3, 4వ దశల్లో మాత్రమే గుర్తించడం జరుగుతోంది. ఇది సోకడానికి నిర్దిష్ఠ కారణాలు తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేనివారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం ద్వారా ఇది రాకుండా నివారించవచ్చు.           

– నేషనల్‌ డెస్క్,సాక్షి   

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement