మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికి లేదు: మాల్దీవ్స్‌ అధ్యక్షుడు | No Country Had The Right To Bully Us, Says Maldives President Muizzu After Visiting China - Sakshi
Sakshi News home page

India-Maldives Controversy: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Published Sat, Jan 13 2024 6:59 PM

No Country Had The Right to Bully us: Maldives President - Sakshi

చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులను విమర్శించే హక్కు ఏ దేశానికి లేదని పరోక్షంగా భారత్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. ‘మాది చిన్న దేశమే కావచ్చు. కానీ అది మీకు మమ్మల్ని అవమానించేందుకు అనుమతి ఇవ్వడం లేదు..’ అంటూ చైనాలో అయిదు రోజుల పర్యటన నేటితో(శనివారం) ముగుస్తున్న సందర్భంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అన్నారు.

కాగా ప్రస్తుతం మాల్దీవులు వర్సెస్‌ భారత్‌ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించి అక్కడి సాగర తీరాన ప్రకృతి అందాలను సేదతీరుతున్న ఫోటోలను, సముద్ర సాహస క్రీడల వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. దీంతో లక్షద్వీప్‌ ఒక్కసారిగా నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. వేల మంది నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు.
చదవండి: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు అంతస్తుల్లో చెలరేగిన మంటలు

మాల్దీవులకు వెళ్లాలనుకుంటున్న పర్యాటకుల చూపు ఒక్కసారిగా లక్షద్వీప్‌ వైపు మళ్ళింది.  దీంతో మాల్దీవుల్లో ఎనిమిది వేలకు పైగా హోటల్‌ బుకింగ్స్‌, వేల సంఖ్యలో విమాన టికెట్లు రద్దయ్యాయి. ఈ పరిణామాలు తమ దేశ పర్యాటకంపై ఎక్కడ ప్రభావం చూపుతాయని భావించిన మాల్దీవులు మంత్రులు.. మోదీ, భారత్‌పై అనుచిత వ్యాఖ్యలుచేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. దీంతో బైకాట్‌ మాల్దీవ్స్‌ అంటూ భారత నెటిజన్లు నెట్టింట్లో నిరసన వ్యక్తం చేశారు. 

దీంతో నష్ట నివారణకు ఉపక్రమించిన మాల్దీవులు సర్కారు.. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్‌ చేసింది.  భారత్‌ విషయంలో మాల్దీవుల ప్రభుత్వ వైఖరిపై సొంత దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం రాజుకున్న సమయంలోనే మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాలో పర్యటించారు. చైనా నుంచి తమ దేశానికి మరింతమంది పర్యాటకులువచ్చేందుకు కృషి చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కోరారు. 

Advertisement
Advertisement