ట్రంప్ ఓడిపోతే, 9/11 తరహా దాడి!

7 Sep, 2020 17:53 IST|Sakshi
ఫైల్ ఫోటో

ట్రంప్‌కు మద్దతుగా  ఒసామా బిన్ లాడెన్ మేనకోడలు కీలక వ్యాఖ్యలు

అమెరికాను రక్షించేది ట్రంప్ ఒక్కరే - నూరి బిన్ లాడెన్

బైడెన్ గెలిస్తే 9/11 తరహా దాడి జరగొచ్చు!

వాషింగ్టన్ : నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున రెండోసారి అధ్యక్ష పదవికి నామినేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై  9/11 దాడుల తరహా సూత్రధారి, దివంగత ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్ మేనకోడలు నూర్ బిన్‌లాడెన్ మద్దతుగా నిలిచారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే దేశాన్ని ఉగ్రవాద కార్యకలాపాల నుండి రక్షించగలరని,  ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి గెలవాలని వ్యాఖ్యానించారు.

న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నూర్ బిన్ లాడెన్  ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ప్రమాదమని, ట్రంప్ గెలిస్తేనే మరోసారి భయంకరమైన 9/11 తరహా దాడులు జరగకుండా అడ్డుకోగలరన్నారు.  అమెరికా మాజీ అధ్యక్షడు ఒబామా,  వైస్ ప్రెసిడెంట్‌గా బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ బాగా విస్తరించిందని ఆరోపించిన ఆమె బైడెన్ అధ్యక్షుడైతే అమెరికాకు ప్రమాదమని హెచ్చరించారు. అంతేకాదు బైడెన్ గెలిస్తే 9/11 తరహా దాడి మరొకటి అమెరికాపై జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్షవాదులు ఎప్పుడూ రాడికలిజంతో పొత్తు పెట్టుకున్నారని  నూర్ ఆరోపించారు.

ట్రంప్ తన హయాంలో ఉగ్రవాదులను నిర్మూలించడంద్వారా అమెరికాను భయంకరమైన ఉగ్రదాడుల నుంచి కాపాడారని నూర్ ఇంటర్వ్యూలో తెలిపారు. తన తల్లితో కలసి మూడేళ్ల వయస్సు నుంచి అనేకమార్లు అమెరికాకు వెళ్లానన్నారు. 2015లో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీకి నిలిచినప్పటినుంచి ఆయనకు తాను ఫ్యాన్ అయిపోయానని, ఇపుడు కూడా ట్రంప్‌ను కచ్చితంగా ఎన్నుకోవాలన్నారు. తద్వారా అమెరికాకు మాత్రమే కాదు, మొత్తం పాశ్చాత్య నాగరికత భవిష్యత్తుకు చాలాముఖ్యమైనదన్నారు. సెప్టెంబర్ 11 దాడుల 19వ వార్షికోత్సవానికి ముందు ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా పెన్సిల్వేనియాలో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున  పోటీపడుతున్న జో బైడెన్ పాల్గొననున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు