PM Narendra Modi Will Travel To Washington Dc, He Will Receive A Ceremonial Welcome At White House - Sakshi
Sakshi News home page

PM Modi USA Visit: రేపే అమెరికాకు ప్రధాని మోదీ

Published Tue, Jun 20 2023 5:45 AM

PM Narendra Modi will travel to Washington DC - Sakshi

వాషింగ్టన్‌/హూస్టన్‌:  ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన ఈ నెల 21 నుంచి 24వ తేదీ దాకా అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, జిల్‌ దంపతుల ఆహ్వానం మేరకు అగ్రరాజ్యంలో మోదీ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోదీ పర్యటన కోసం భారత–అమెరికన్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నారు.

మోదీకి స్వాగత సందేశాన్ని పంపించడానికి రాజధాని వాషింగ్టన్‌ డీసీ సహా అమెరికావ్యాప్తంగా 20 నగరాల్లో భారత–అమెరికన్లు తాజాగా ఐక్యతా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనల్లో వందలాది మంది ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌లో మోదీ హాజరయ్యే కార్యక్రమంలో పాల్గొనేందుకు టికెట్ల కోసం భారత–అమెరికన్లు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పుడు అమెరికా అంతటా మోదీ పర్యటనపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 

రక్షణ బంధాలకు పెద్దపీట  
రక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్‌–అమెరికా చేతులు కలుపుతున్నాయి. మోదీ అమెరికా పర్యటనలో ఇదే అంశంపై విస్తృతంగా చర్చలు జరుగనున్నాయి. రక్షణ రంగంలో సహకారంపై ఇరుదేశాలు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ రోడ్డు మ్యాప్‌ను సైతం ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇకపై కలిసి పనిచేయాలని భారత్‌–అమెరికా ఇప్పటికే నిర్ణయించుకున్నాయి.

24, 25న మోదీ ఈజిప్టు పర్యటన  
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24, 25న ఈజిప్టులో పర్యటిస్తారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సిసీ ఆహా్వనం మేరకు ఆయన ఈ పర్యటన తలపెట్టారు. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 11వ శతాబ్దం నాటి చారిత్రక అల్‌–హకీం మసీదును మోదీ సందర్శిస్తారు. దావూదీ బోహ్రా ముస్లిం సామాజికవర్గం సహాయంతో ఈ మసీదును ఇటీవలే పునరుద్ధరించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన భారత సైనికులకు హెలియోపోలిస్‌ వార్‌ సెమెట్రీలో మోదీ నివాళులరి్పస్తారు. ఈజిప్టు అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. ఈజిప్టులోని భారతీయులతో సమావేశమవుతారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement