ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూత

10 Apr, 2021 04:31 IST|Sakshi

99 ఏళ్ల వయసులో తిరిగిరాని లోకాలకు వెళ్లిన రాణి ఎలిజెబెత్‌ భర్త 

వెల్లువెత్తిన సంతాప సందేశాలు

విండ్సర్‌ కేజల్‌గా భారీగా జనసందోహం

లండన్‌ : బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌–2 భర్త, ప్రిన్స్‌ ఫిలిప్‌ 99 ఏళ్ల వయసులో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. నూరవ పుట్టిన రోజు వేడుకని మరో రెండు నెలల్లో చేసుకోవాల్సిన డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌ రాణితో 73 ఏళ్ల సహచర్యాన్ని వీడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని రాణి తరఫున బంకింగ్‌çహామ్‌ ప్యాలెస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘విండ్సర్‌ కేజల్‌లో శుక్రవారం ఉదయం డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌ ప్రశాంతంగా కన్ను మూశారు.

బాధాతప్తమైన హృదయంతో రాణి తన భర్త మరణవార్తని ప్రపంచానికి వెల్లడించారు’’అని ఆ ప్రకటన పేర్కొంది. జూన్‌ 10న ఫిలిప్‌ శతవసంత వేడుకల్ని వైభవంగా నిర్వహించడానికి రాజకుటుంబం ఏర్పాట్లు చేస్తూ ఉన్న సమయంలో ఆయన మరణ వార్త వినడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇటీవల ఆయన గుండెకు శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిలిప్‌ మరణవార్త తెలుసుకోగానే ప్రపంచం నలుమూలల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.

ఎంతో మంది యువత జీవితాల్లో ఆయన స్ఫూర్తిని నింపారని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. యూకేతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని తరాల వారి ప్రేమాభిమానాలను ఆయన చూరగొన్నారని కొనియాడారు. ప్రిన్స్‌ మరణవార్త విని విండ్సర్‌ కేజల్‌కి జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి గేటు బయటే పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తున్నారు. ఫిలిప్, ఎలిజెబెత్‌ దంపతులకు ప్రిన్స్‌ చార్లెస్, ప్రిన్సెస్‌ అన్నె, ప్రిన్స్‌ ఆండ్రూ, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ నలుగురు పిల్లలు. ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లు, 10 మంది మునిమనవలు ఉన్నారు.

మోదీ సంతాపం
ప్రిన్స్‌ ఫిలిప్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మిలటరీలో అద్భుతమైన కెరీర్‌తో పాటు, సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్‌ చేశారు.  

భారత్‌ పర్యటన వివాదాస్పదం
రాణి ఎలిజెబెత్‌తో కలిసి ఫిలిప్‌ మూడుసార్లు భారత్‌ పర్యటనకు వచ్చారు. 1961, 1983, 1997లో ఆయన భారత్‌ని సందర్శించారు. 1961లో భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఫిలిప్‌ పులిని వేటాడడం వివాదాస్పదమైంది. జైపూర్‌ రాజ దంపతులతో కలిసి రాణి ఎలిజెబెత్, ఫిలిప్‌ వారి దగ్గర చనిపోయి పడి ఉన్న పులి ఫోటో అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. పర్యావరణ, జంతు ప్రేమికుడిగా అప్పటికే ఆయనకు ఒక గుర్తింపు ఉంది. వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ యూకే అధ్యక్షుడిగా ఆయన ఆ ఏడాది నియమితులు కావడంతో పులిని కాల్చడం వివాదాన్ని రేపింది. అయితే ఆ తర్వాత ఆయన పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిని ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటారు.  
 
రాణికి కొండంత అండ
గ్రీకు వంశంలో పుట్టిన ఫిలిప్‌.. యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడానికి తన రాచరిక హోదాలన్నీ వదులకున్నారు. ఆమె బ్రిటన్‌ సింహాసనం ఎక్కాక నీడలా వెన్నంటే ఉంటూ పాలనలో పూర్తిగా సహకరించారు. బ్రిటన్‌లో రాజ్యాంగబద్ధమైన హోదా ఏమీ లేకపోయినా రాణి పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో రాణి వెనకాలే అడుగులో అడుగులు వేసుకుంటూ నడిచినప్పటికీ బ్రిటన్‌ రాచకుటుంబంలో ప్రతీ చోటా ఆయన ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. రాజకుటుంబంలో ఆయన మాటే శాసనంగా మారింది. అందుకే రాణి ఎలిజెబెత్‌ తమ 50వ వివాహ వేడుకల్లో ‘‘నా భర్తే నాకు కొండంత బలం’’అంటూ తన ప్రేమని బహిరంగంగానే చాటుకున్నారు.

భార్య చాటు భర్తలా మిగిలిపోకూడదని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి సామాజిక సేవలోనే ఎక్కువ భాగం గడిపారు. ఎన్నో చారిటీలను నడిపారు. యువతరం బాగుంటేనే దేశ భవిష్యత్‌ బాగుంటుందని నమ్మిన ఫిలిప్‌ వారిని అన్ని విధాలుగా సంస్కరించాలని చూసేవారు. రాజకుటుంబంలో బూజుపట్టిన సంప్రదాయాల్ని విడనాడి ఆధునీకరణ విధానాలను ప్రవేశపెట్టాలని చూశారు కానీ అవి కుదరలేదు. ప్రిన్స్‌ ఫిలిప్‌ గొప్ప సాహసి. బ్రిటన్‌ నేవీ కమాండర్‌గా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ నౌకలో సేవలందించారు. ఫిలిప్‌ది ముక్కు సూటి మనస్తత్వం. మనసులో అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు. ఆ మనస్తత్వమే ఆయనను చాలా సార్లు ఇబ్బందుల్లో పడేసింది.  

గ్రీకు వీరుడు, ఎలిజెబెత్‌ రాకుమారుడు

► జూన్‌ 10,1921: గ్రీకు రాజ కుటుంబంలో జననం  
► 1939: బ్రిటిష్‌ రాయల్‌ నేవీలో కమాండర్‌గా ఉద్యోగం
► 1942: మొదటి లెఫ్ట్‌నెంట్‌గా అపాయింట్‌మెంట్‌  
► 1947: యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడం కోసం గ్రీక్‌ డానిష్‌ రాయల్‌ టైటిల్స్‌ని వదులుకున్నారు
► నవంబర్‌ 20, 1947: ఎలిజెబెత్‌తో వివాహం
► 1951:   నేవీ కెరీర్‌ను వదులుకొని ఎలిజెబెత్‌కు అండదండలు  
► 2017: ప్రజా జీవితం నుంచి పదవీ విరమణ  
► 2019: కారు ప్రమాదానికి లోనుకావడంతో డ్రైవింగ్‌ను వదిలేశారు, ఇదే ఏడాది ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి
► ఫిబ్రవరి 17 2021:   ఆస్పత్రిలో చేరిక  
► మార్చి 4 2021 : గుండెకు విజయవంతంగా చికిత్స   
► మార్చి 16 2021 : ఆస్పత్రి నుంచి ప్యాలెస్‌కి  
► ఏప్రిల్‌ 9: ప్రశాంతంగా తుది శ్వాస  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు