వినాశకర సాటన్-ll మిసైల్‌ను బయటకు తీసిన రష్యా..  ఏమీ మిగలదు! | Sakshi
Sakshi News home page

ఇకపై మాతో పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.. పుతిన్

Published Sat, Sep 2 2023 9:24 PM

Russia Deploys Satan II Missiles Putin Says Make Enemies Think Twice - Sakshi

మాస్కో: రష్యా  అత్యంత వినాశకరమైన అణుక్షిపణి (సర్మాత్)సాటన్-ll ను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ క్షిపణి విజయవంతమైనప్పుడు దీని గురించి చెబుతూ.. ఇకపై మాతో కయ్యానికి కాలు దువ్వే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని ప్రత్యర్థులను హెచ్చరించారు. తాజాగా ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఈ క్షిపణిని బయటకు తీయడం చర్చనీయాంశమైంది.   

శుక్రవారం సాటన్-llగా పిలవబడే ఈ సర్మాత్ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్‌ను రష్యా సైన్యం బయటకు తీసినట్లు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్ ప్రకటించింది. ఈ మేరకు రోస్‌కాస్మోస్ జనరల్ డైరెక్టర్ యూరి బోరిసోవ్ సాటన్-ll విధినిర్వహణకు సిద్ధమైందని ప్రకటించారు.   

అసలేంటి సాటన్-ll ప్రత్యేకత.. 
సాటన్-ll మిసైల్ పొడవు 116 మీటర్ల. 220 టన్నులు బరువుండే ఈ మిసైల్ 10-15 వార్‌హెడ్‌లను అమర్చే వీలుంటుంది. అందుకే ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను సులువుగా ఛేదిస్తుంది. శత్రువుల రాడార్లు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు ఈ మిసైల్‌ను గుర్తించే లోపే ఇది లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సాటన్-ll గంటకు 10 వేల నుంచి 18 వేల కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఐరోపాలోని ఏ ప్రాంతానికైనా ఇది కేవలం 3 నిమిషాల్లోపే చేరుకోగలదు. ఇక అగ్రరాజ్యం అమెరికా చేరుకోవడానికి ఈ క్షిపణికి కేవలం 14 నిముషాలు మాత్రమే పడుతుంది.  

ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలై ఏడాదిన్నర పైబడిండి. ఇప్పటికీ యుద్ధం ఒక కొలిక్కి రాకపోగా ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్ధవంతనగానే తిప్పికొట్టింది. ఇక ఇప్పుడైతే అమెరికా అండదండలతో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తూ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యుద్ధప్రారంభంరోజుల్లో రష్యా స్వాధీనం చేసుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి తన వశం చేసుకుంటోంది. ఇప్పటికే డిఫెన్స్‌లో పడిన రష్యా సేనలు ఈ నేపథ్యంలోనే ఈ భయానక మిసైళ్లను బయటకు తీసిందని చెప్పేవారు లేకపోలేదు. మరోపక్క రష్యా ఈ క్షిపణిని నాటో సంస్థ మూలస్థంభాలైన అమెరికా, యూకెలపై మాత్రమే ప్రయోగించడానికి సిద్ధం చేసిందనే వారూ ఉన్నారు.

ఏదైతేనేం ప్రస్తుతానికైతే రష్యా తన అమ్ములపొదిలోని అత్యంత భయంకరమైన మిసైళ్లను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతీయ టీవీ ఛానల్‌లో ప్రసంగిస్తూ.. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి మాకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని అన్నారు. అందులో భాగంగానే ఈ చర్యకు ఉపక్రమించారని మాత్రం అర్ధమవుతోంది.

ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక!

Advertisement
Advertisement