స్నేహితుడి కాపురం కూల్చిన ఎలన్‌ మస్క్‌!

16 Sep, 2023 18:32 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ వ్యక్తిగత కారణాలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మస్క్‌ కారణంగా మాజీ స్నేహితుడు, గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సర్గీ బ్రిన్ వైవాహిక జీవితం కుదేలు అయ్యింది.  తన భార్య నికోల్‌ షన్‌హన్‌ నుంచి బ్రిన్‌ గప్‌చుప్‌గా విడాకులు తీసేసుకున్నాడు. మస్క్‌తో అఫైర్‌ నడిపిందనే కారణంతోనే ఈ ఏడాది మే నెలలో సర్గీ.. షన్‌హన్‌కు విడాకులు మంజూరు అయినట్లు తాజాగా పేజ్‌6 ఓ కథనం ప్రచురించింది. 

‘‘అంతా గప్‌చుప్‌గా జరిగిపోయింది. మే 26వ తేదీనే విడాకులు మంజూరు అయ్యాయి. లీగల్‌గా ఆ జంట విడిపోయింది. నాలుగేళ్ల కూతురి సంరక్షణపైనా స్పష్టమైన ఒప్పందం జరిగింది. షన్‌హన్‌ విడాకుల పట్ల సుముఖంగా లేకపోవడమే కాదు.. తన భర్త నుంచి సపోర్ట్‌ కూడా కోరింది. కానీ, ఏ విషయంలోనూ నికోల్‌ షన్‌హన్‌ నుంచి తనకు మద్దతు అవసరం లేదని సర్గీ పిటిషన్‌లో పేర్కొన్నారు’’ అని కోర్టు విడాకుల ఉత్తర్వుల సారాంశాన్ని పేజ్‌6 కథనం ప్రచురించింది. 

2015లో సర్గీ బ్రిన్‌ తన మొదటి భార్య అన్నె వోజ్సిస్కి నుంచి విడాకులు తీసుకున్నారు. అదే ఏడాదిలో షెహనన్‌తో సర్గీకి పరిచయం అయ్యింది. మూడేళ్ల డేటింగ్‌ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే 2021 నుంచి ఆ ఇద్దరూ విడివిడిగా ఉంటూ వస్తున్నారు. ఆ మరుసటి ఏడాదిలో బ్రిన్‌ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. సరిదిద్దలేని మనస్పర్థలు తమ మధ్య చోటుచేసుకున్నాయంటూ విడాకుల కారణంగా పేర్కొన్నారు బ్రిన్‌. అయితే.. 

షెహనన్‌కు మరో వ్యాపారవేత్త, సర్గీ బ్రిన్‌ స్నేహితుడైన ఎలన్‌ మస్క్‌తో శారీరక సంబంధం ఉందని.. ఆ విషయం తెలిసిన వెంటనే బ్రిన్‌ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడని అప్పట్లో న్యూయార్క్‌ పోస్ట్‌ సంచలన కథనం ప్రచురించింది.  కానీ, ఈ ఆరోపణలపై ఎలన్‌ మస్క్‌, షెహనన్‌ ఖండిస్తూ వస్తున్నారు. అయితే బ్రిన్‌ మాత్రం ఈ పరిణామంపై మీడియా ముందు మాట్లాడటానికి ఏనాడూ ఇష్టపడలేదు. 

అప్పటి నుంచే..
ఎలన్‌ మస్క్‌ను ఆర్థిక కష్టాల నుంచి 2008లో బయటపడేసింది సర్గీనే. అలాంటిది.. బ్రిన్, ఎలన్‌ మస్క్‌ గురించి చెడుగా ప్రచారం చేయడం ప్రారంభించాడు. అప్పట్లో ఎలన్‌ మస్క్‌ కంపెనీల్లోని వాటాలన్నీ బ్రిన్‌ అమ్మేసుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు తన సలహాదారులకు, అనుచరులకు ఎలన్‌ మస్క్‌ కంపెనీల్లో ఉన్న వాళ్ల వాళ్ల వాటాలను అమ్మేసుకోవాలని పిలుపు ఇవ్వడంతో.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  

స్నేహితుడి భార్యతోనే మస్క్‌ ఎఫైర్‌ నడిపాడని, గత డిసెంబర్‌లో ఈ వ్యవహారానికి సంబంధించి మస్క్‌, నికోల్‌కు క్షమాపణలు కూడా తెలియజేశాడని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం ప్రచురించింది.

అయితే అటు ఎలన్‌ మస్క్‌, ఇటు నికోల్‌.. ఇద్దరూ తమ మధ్య ఎలాంటి అఫైర్‌ లేదంటూ చెబుతూనే వస్తున్నారు. నికోల్‌ అయితే ఓ అడుగు ముందుకేసి ఓ ఇంటర్వ్యూలో బోల్డ్‌ కామెంట్ల ద్వారా తమ మధ్య ఎలాంటి అఫైర్‌ లేదంటూ వివరణ ఇచ్చుకుంది.

మరిన్ని వార్తలు