వారం రోజుల అంతరిక్ష టూర్‌.. ఒక్కొక్కరు ఎన్ని కోట్లు చెల్లించారంటే?

9 Apr, 2022 14:24 IST|Sakshi

కేప్‌ కార్న్‌వాల్‌: వారం రోజులు అంతరిక్షంలో నివసించేందుకు ముగ్గురు బడా వ్యాపారవేత్తలను, వారి రక్షక ఆస్ట్రోనాట్‌ను శుక్రవారం స్పేస్‌ఎక్స్‌ కంపెనీ అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)కు పంపింది. ఐఎస్‌ఎస్‌కు స్పేస్‌ఎక్స్‌ తొలి ప్రైవేట్‌ ప్రయాణం ఇదే కావడం విశేషం. శనివారం ఈ ముగ్గురూ ఐఎస్‌ఎస్‌లోకి చేరుకున్నారు. రాకెట్‌ ప్రయాణానికి, అంతరిక్షంలో విడిదికి వీరు ఒక్కొక్కరు దాదాపు 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 418 కోట్లు) చెల్లించారు. వీరు ఐఎస్‌ఎస్‌లో రష్యా సొంతమైన ప్రాంతం తప్ప ఇతర ప్రాంతాలన్నీ చూడవచ్చు.

అమెరికాకు చెందిన లారీ కానర్, కెనెడాకు చెందిన మార్క్‌ పాతీ, ఇజ్రాయిల్‌కు చెందిన ఈటాన్‌ స్టిబ్బె ఈ టికెట్లను కొనుగోలు చేశారు. వీరికి రక్షణగా సీనియర్‌ ఆస్ట్రోనాట్‌ మైకెల్‌ లోపెజ్‌ వెళ్లారు. ఇప్పటికే రష్యా, అమెరికా దేశాల స్పేస్‌ ఏజెన్సీలు అంతరిక్ష టూర్లను నిర్వహిస్తున్నాయి. తాజా ప్రయాణంతో వీటి సరసకు స్పేస్‌ఎక్స్‌ చేరింది. జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూఆరిజిన్‌ కంపెనీ అంతరిక్షం అంచులకు ప్రైవేట్‌ యాత్రలు నిర్వహిస్తోంది.త్వరలో వర్జిన్‌ గెలాక్టిక్‌ కంపెనీ సైతం ఈ యాత్రలు నిర్వహించనుంది.    

చదవండి: (కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి)

మరిన్ని వార్తలు