వైట్‌హౌస్‌ నుంచి వెళ్లాల్సిందే | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ నుంచి వెళ్లాల్సిందే

Published Sun, Dec 13 2020 4:44 AM

Supreme Court rejects Donald Trump attempt to overturn results - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  వైట్‌ హౌస్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అ««ధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయనకి  ఎదురు దెబ్బ తగిలింది.  జార్జియా, మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్ని నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు శామ్యూల్‌ అలిటో, క్లారెన్స్‌ థామస్‌లు శుక్రవారం కొట్టేశారు. అవకతవకలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సోమవారం సమావేశం కానున్న ఎలోక్టరల్‌ కాలేజీ బైడెన్‌ను ఎన్నుకుంటే ఇక ట్రంప్‌ వైట్‌హౌస్‌ను వీడాల్సి ఉంటుంది.

దేశాన్నే ఇరుకున పెట్టారు : ట్రంప్‌
సుప్రీం కోర్టు తీర్పు దేశాన్నే ఇరుకున పెట్టేలా ఉందంటూ ట్రంప్‌ మండిపడ్డారు. ఇలాంటి తీర్పు ఇవ్వడం న్యాయాన్ని అవమానిం చడమేనన్నారట్వీట్‌ చేశారు.

వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం
అగ్రరాజ్యంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇవ్వడంతో వ్యాక్సినేషన్‌ ప్రారంభం  కానుంది. ‘‘తొమ్మిది నెలల్లో సురక్షితమైన, సామర్థ్యమైన వ్యాక్సిన్‌ను రూపొందించాం’’ అని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.  కరోనా మహమ్మారిని నిర్మూలించే రోజులు దగ్గర పడుతున్నాయన్న ట్రంప్‌ ఈ వ్యాక్సిన్‌ లక్షలాది మందికి ప్రాణం పోస్తుందని అన్నారు. వ్యాక్సిన్‌ వినియోగానికి ఎఫ్‌డీఏ అనుమతినివ్వడం తనని  ఉద్వేగానికి గురి చేసిందని ట్రంప్‌ అన్నారు.

వ్యాక్సిన్‌పై విశ్వాసం ఉంచండి: బైడెన్‌
కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని, పూర్తి విశ్వాసంతో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా శాస్త్రవేత్తలు నాణ్యమైన టీకాను రూపొందించారని చెప్పారు. ఎఫ్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ స్టీఫెన్‌ హన్‌పై వైట్‌హౌస్‌ ఒత్తిడి తీసుకురావడంతో ఫైజర్‌కు అనుమతులు లభించాయన్న ఆరోపణలున్న నేపథ్యంలో బైడెన్‌ వ్యాక్సిన్‌పై ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదన్నారు. కరోనాతో అతలాకుతలమవుతున్న దేశాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమకోర్చి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారని చెప్పారు. వ్యాక్సిన్‌ తయారీలో పాల్గొన్న వారందరినీ అభినందించారు.  

Advertisement
Advertisement