హారిస్‌ ప్రెసిడెంట్‌ అయితే.. అమెరికాకే అవమానం | Sakshi
Sakshi News home page

జో బైడెన్‌ గెలిస్తే.. చైనా గెలిచినట్లే: డొనాల్డ్‌ ట్రంప్‌

Published Wed, Sep 9 2020 12:09 PM

Trump Said Kamala Harris Become First Woman President Will Be Insult To US - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆమెను అమెరికా ప్రజలు ఇష్టపడబోరని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆమె గనుక అమెరికా ప్రెసిడెంట్‌ అయితే.. అది దేశానికే అవమానకరం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఆమె అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, జో బైడెన్ ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేయడం ఆసక్తికరమైన విష‌యమ‌న్నారు ట్రంప్‌. ఇదే సమయంలో, చైనాపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రపంచ గొప్ప ఆర్థిక వ్యవస్థగా అమెరికాని నిర్మించామని చెప్పిన ట్రంప్‌‌... చైనా వైర‌స్ క‌రోనా వల్ల ఇప్పుడు త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఎన్నో ఇబ్బందిక‌ర‌ ప‌రిస్థితులు వచ్చాయ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. జో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టేనని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఆయ‌న  విధానాల వల్ల అమెరికా దిగ‌జారిపోతుంద‌ని డ్రాగ‌న్ దేశానికి తెలుసని చెప్పారు. (చదవండి: ట్రంప్ ఓడిపోతే, 9/11 తరహా దాడి!)

జో బైడెన్‌ పాలసీలన్ని చైనాకు అనుకూలంగా ఉంటాయని.. అందుకే ఆయన శత్రువలు బైడెన్‌ గెలవాలని కోరుకుంటున్నారంటూ ట్రంప్‌ విమర్శలు చేశారు. అంతేకాక గతంలో తాను చైనాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పుడు చాలా భిన్నంగా చూస్తానని తెలిపారు. ‘మేము చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం. దాని సిరా ఆరాకముందే చైనా కరోనా వైరస్‌ని ప్రపంచం మీదకు వదిలింది. కనుక ఆ వాణిజ్య ఒప్పందాన్ని నేను ఇప్పుడు గతంలో కంటే భిన్నంగా చూస్తాను’ అన్నారు ట్రంప్‌.

Advertisement
Advertisement