Sakshi News home page

ట్రంప్‌ వర్సెస్‌ నిక్కీ.. దుమారం రేపుతున్న ట్వీట్‌

Published Wed, Jan 10 2024 1:49 PM

Trump Social Media Claim Leads To Spar Between Republicans - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీ బ్యాలెట్‌లు సమీపిస్తున్న కొద్దీ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న రిపబ్లికన్‌ క్యాండిడేట్ల మధ్య విమర్శల వేడి రాజుకుంటోంది. ఈ క్రమంలోనే అధ్యక్షపదవికి నామినేషన్‌ ఆశిస్తున్న నిక్కీ హాలేపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున ప్రెసిడెంట్‌ అభ్యర్థిత్వ రేసులో ముందున్న ట్రంప్‌ షేర్‌ చేసిన ఒక సోషల్‌ మీడియా పోస్టు దుమారం రేపుతోంది.

ఇది కచ్చితంగా జాతి వివక్షత కిందకే వస్తుందని నిక్కీ దుయ్యబడుతున్నారు. నిక్కీ నిజమైన అమెరికన్‌ సిటిజన్‌ కాదని, అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆమెకు అర్హత లేదని ట్రంప్‌ షేర్‌ చేసిన పోస్టు సారాంశం. 1972లో నిక్కీ అమెరికాలో జన్మించే సరికి ఆమె తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వం రాలేదని ఆ పోస్టులో చెప్పుకొచ్చారు.

అయితే ట్రంప్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ చేస్తున్న రిపబ్లికన్లు నిక్కీపై ఆయన షేర్‌ చేసిన పోస్టును తీవ్రంగా తప్పుబడుతున్నారు. నిజానికి నిక్కీ అమెరికాలో పుట్టారన్న ఒకే ఒక్క అర్హతతో ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, ఆమె తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.

కాగా, సీఎన్‌ఎన్‌ సర్వే ప్రకారం త్వరలో ప్రైమరీ జరగనున్న న్యూ హాంప్‌షైర్‌లో ట్రంప్‌కు, నిక్కీకి మధ్య హోరాహోరీ పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఇక్కడి రిపబ్లికన్‌ ఓటర్లలో నిక్కీకి మద్దతు ఒక్కసారిగా పెరిగింది. ట్రంప్‌కు ఇక్కడ 39 శాతం మంది ఓటర్లు మద్దతునిస్తుండగా నిక్కీకి 32 శాతం మంది మద్దతిస్తుండటం గమనార్హం.  

ఇదీచదవండి..రష్యాలో మిస్టరీ డెత్స్‌.. ఎక్కువ మరణాలు వారివే  

Advertisement
Advertisement