UK PM results 2022: జాన్సన్‌ వారసులెవరో తేలేది నేడే

5 Sep, 2022 05:30 IST|Sakshi

బ్రిటన్‌ ప్రధాని ఎన్నికకు కౌంట్‌డౌన్‌

కొన్ని గంటల్లోనే తేలిపోనున్న ఫలితం

అందరి దృష్టీ రిషి సునాక్‌ మీదే

లిజ్‌ ట్రస్‌ వైపే మొగ్గు?

నూతన ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తానని రిషి వెల్లడి

లండన్‌: యూకే తదుపరి ప్రధాని ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌(42), మంత్రి లిజ్‌ ట్రస్‌(47) ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్‌ పార్టీలో ఎక్కువ మంది లిజ్‌ ట్రస్‌ వైపే మొగ్గుచూపుతున్నట్లు పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. లిజ్‌ ట్రస్‌ ఎన్నికైతే బ్రిటన్‌ ప్రధానిగా మార్గరెట్‌ థాచర్, థెరిసా మే తర్వాత మూడో మహిళ కానున్నారు. ఆన్‌లైన్, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు ఓటు వేసి పార్టీ నేతను ఎన్నుకుంటారు.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న సర్‌ గ్రాహం బ్రాడీ వెల్లడిస్తారు. ఎన్నికైన నేత డౌనింగ్‌ స్ట్రీట్‌కు సమీపంలోనే ఉన్న రాణి ఎలిజబెత్‌–2 కాన్ఫరెన్స్‌ సెంటర్‌ నుంచి సంక్షిప్త ప్రసంగం చేస్తారు. మంగళవారం డౌనింగ్‌ స్ట్రీట్‌ కార్యాలయం నుంచి ఆపద్ధర్మ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. అనంతరం స్కాట్లాండ్‌లో ఉన్న రాణి ఎలిజబెత్‌కు తన రాజీనామాను అందజేస్తారు.

ఆపైన, పార్టీ నేతగా ఎన్నికైన వారు స్కాట్లాండ్‌కు వెళ్లి రాణి నుంచి నియామక పత్రం అందుకుంటారు. ఇంగ్లండ్‌కు, బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు బదులుగా మరోచోట నుంచి ప్రధాని పేరును రాణి ప్రతిపాదించడం బ్రిటన్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. 96 ఏళ్ల రాణి వయస్సు రీత్యా ప్రయాణాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఆమె అబెర్దీన్‌షైర్‌ బాల్మోరల్‌ కోటలో గడుపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి డౌనింగ్‌ స్ట్రీట్‌ కార్యాలయం నుంచి మొదటి ప్రసంగం చేయడానికి ముందే కీలకమైన కేబినెట్‌ పదవులను ఖరారు చేస్తారు.

సీనియర్‌ అధికారులు నూతన ప్రధానికి భద్రతకు సంబంధించిన కీలక వివరాలను, అణ్వాయుధాల రహస్య కోడ్‌లను అందజేస్తారు. బుధవారం మధ్యాహ్నం అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కొత్త నేత హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ప్రతిపక్ష నేత ప్రశ్నలకు సమాధానాలిస్తారు. కోవిడ్‌ నిబంధనలన ఉల్లంఘిస్తూ పార్టీలు జరుపుకోవడం, పార్టీ సీనియర్‌ నేత ఒకరు కుంభకోణంలో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్‌లోని సుమారు 60 మంది సీనియర్‌ నేతలు రాజీనామాలు చేశారు. దీంతో అధికార పార్టీ కొత్త నేతను ఎన్నుకునే సుదీర్ఘ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే.

ఇంధన భారం తగ్గిస్తాం
ఇంధన సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, గృహ వినియోగదారులకు విద్యుత్‌ బిల్లుల భారం తగ్గిస్తామని యూకే ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్‌ ట్రస్‌ తెలిపారు. బ్రిటన్‌ ప్రధాని పదవికి జరిగే ఎన్నికలో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు బరిలో ఉన్న విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే పోలింగ్‌ జరగనున్న సమయంలో ఆదివారం వీరు బీబీసీ ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు.

రష్యా– ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా యూకేలో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో, ఇదే ప్రధాన అంశంగా మారింది. కొత్త ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా రిషి సునాక్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌ సభ్యునిగా కొనసాగుతానని, తన సొంత రిచ్‌మండ్, యార్క్‌షైర్‌ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏం చేస్తారన్న ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాని పదవి రేసులో ఉంటారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. 

మరిన్ని వార్తలు