Sakshi News home page

Sanctions Impact On Russia: రష్యా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం

Published Tue, Mar 1 2022 8:36 AM

Ukraine Crisis: Heavy Sanctions To Cripple Russian Economy - Sakshi

మాస్కో: ఆంక్షల ప్రభావం రష్యాపై గట్టిగానే పడుతోంది. ఆర్థికంగా ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ కరెన్సీ రూబుల్‌ విలువ శరవేగంగా పడిపోతోంది. యుద్ధానికి ముందు డాలర్‌కు 80 రూబుల్స్‌ లోపే ఉండేది కాస్తా ఇప్పుడు ఏకంగా 96 రూబుల్స్‌కు దిగజారింది. గత వారం పది రోజులతో పోలిస్తే సోమవారం ఉదయం ఒక దశలో డాలర్‌తో రూబుల్‌ విలువ 30 శాతం దాకా పడిపోయింది. స్విఫ్ట్‌ వ్యవస్థ నుంచి ప్రధాన రష్యా బ్యాంకులను బహిష్కరించడం ఎగుమతులు, దిగుమతులపై భారీ ప్రభావమే చూపుతోంది. దాంతో దేశంలో నిత్యావసరాల ధరలు కూడా నింగినంటేలా కన్పిస్తున్నాయి.

ఈ పరిణామంతో సగటు రష్యన్లు బెంబేలెత్తిపోతున్నారు. దాంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు సోమవారం దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు తీరి కన్పించారు. గూగుల్‌పే తదితర పేమెంట్‌ యాప్స్‌ ద్వారా చెల్లింపులకు కూడా ఇబ్బందులే ఎదురయ్యేలా కన్పిస్తోంది. దిగుమతి చేసుకున్న వస్తువులపైనే రష్యా ఎక్కువగా ఆధారపడుతుంది. దాంతో పలు వస్తువుల ధరలు చుక్కలనంటడం ఖాయంగా కన్పిస్తోంది. ఆంక్షల ప్రభావం చూస్తుండగానే రష్యా ఆర్థిక వ్వస్థను ఘోరంగా దెబ్బ తీయడం ఖాయమని వర్జీనియాలోని విలియం అండ్‌ మేరీ సంస్థలో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ ఫెల్డ్‌మన్‌ అభిప్రాయపడ్డారు. దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ఖరీదూ పెరగడం ఖాయమని, ప్రభుత్వం భారీగా సబ్సిడీలిచ్చి ఆదుకుంటే తప్ప ఈ భారాన్ని జనమే మోయాల్సి వస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం సబ్సిడీలకు ముందుకు రావడం అనుమానమే. 

నిరసనలు మరింత తీవ్రం! 
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యాలో చాలామంది ఇప్పటికే నిరసిస్తున్నారు. ‘మేం రష్యన్లం. కానీ యుద్ధాన్ని కోరుకోవడం లేదు’ అంటూ దాడి మొదలైన తొలి రోజు నుంచీ పలు నగరాల్లో ప్రజలు ప్లకార్డులు ప్రదర్శిస్తుండటం, ఉక్రెయిన్‌కు సానుభూతి తెలుపుతుండటం తెలిసిందే. ఇప్పుడు యుద్ధం వల్ల అన్ని ధరలూ ఆకాశాన్నంటి బతకడమే కనాకష్టంగా మారుతుండటం వారిలో ఆగ్రహావేశాలను మరింతగా పెంచే పరిస్థితి కనిపిస్తోంది. 

దిద్దుబాటు చర్యలు 
ఈ పరిస్థితుల్లో రష్యా సెంట్రల్‌ బ్యాంకు రంగంలోకి దిగింది. కీలకమైన వడ్డీ రేటును 9.5 శాతం నుంచి ఏకంగా 20 శాతానికి పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. అయినా ఆంక్షల ప్రభావాన్ని ఇది ఎంత మేరకు అడ్డుకుంటుందన్నది అనుమానమే అంటున్నారు. పైగా వడ్డీరేటు పెంపు మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.  రష్యా కరెన్సీ రిజర్వులను జప్తు చేయాలని పశ్చిమ దేశాలు తీసుకున్న నిర్ణయం  ప్రభావం తీవ్రంగానే ఉంటుందని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ సైతం అంగీకరించారు.  640 బిలియన్‌ డాలర్ల రష్యా కరెన్సీ నిల్వల్లో ఎంతమేరకు బయటి దేశాల్లో ఉన్నదీ స్పష్టత లేకపోయినా, కనీసం సగం దాకా జప్తు కావచ్చని యూరప్‌ అధికారుల అంచనా. 

Advertisement

తప్పక చదవండి

Advertisement