ఉక్రెయిన్‌పై క్షిపణుల మోత.. యూరప్‌కు కరెంటు కట్‌

12 Oct, 2022 03:58 IST|Sakshi

ఇంధన కేంద్రాలపై రష్యా దాడులు 

20 మంది మృతి, వందల్లో క్షతగాత్రులు   

కీవ్‌: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. రష్యా, క్రిమియాలను కలిపే కెర్చ్‌ వంతెనపై బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా దాడులను రష్యా మంగళవారం మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌ నగరాలే లక్ష్యంగా సోమవారం ఏకంగా 84 క్షిపణులతో విరుచుకుపడటం తెలిసిందే. మంగళవారం ఉక్రెయిన్‌లోని మిలటరీ కమాండ్‌ సెంటర్లు, ఇంధన కేంద్రాలే లక్ష్యంగా భారీ దాడులకు దిగింది. దాంతో జెలెన్‌స్కీ ప్రభుత్వం యూరప్‌ దేశాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపేయాల్సి వచ్చింది.

సుదూర ప్రాంతాలను ఛేదించే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యా విధ్వంసం సృష్టిస్తోంది. క్షిపణి దాడుల తో లివీవ్‌ నగరం అల్లాడుతోంది. వేలాది మంది బంకర్లలో తలదాచుకుంటున్నారు. మంగళవారం దాడుల్లో 20 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అండగా గగనతల రక్షణ వ్యవస్థలను తరలించడానికి అమెరికా, జర్మనీ అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. అత్యాధునికమైన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌లను పంపుతామని హామీ ఇచ్చారు. 

ఫేస్‌బుక్‌పై ఉగ్ర ముద్ర 
ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాంల మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీని ఉగ్రవాద సంస్థగా రష్యా ప్రకటించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు అది ఊతమిస్తోందని ఆరోపిస్తోంది.

రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు 
ఐరాస: ఐక్యరాజ్యసమితిలో భారత్‌ మరోసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాలను రష్యా దురాక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానంపై రహస్య ఓటింగ్‌ నిర్వహించాలన్న రష్యా డిమాండ్‌ను భారత్‌ తిరస్కరించింది. దీనిపై జరిగిన ఓటింగ్‌లో మరో 100కు పైగా దేశాలతో కలిసి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది.

ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్, డొనెట్‌స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బేనియా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై రష్యా రహస్య ఓటింగ్‌ డిమాండ్‌ను భారత్‌ సహా 107 సభ్య దేశాలు తిరస్కరించాయి. 13 దేశాలు రష్యా డిమాండ్‌కు అనుకూలంగా ఓటేయగా చైనా సహా 39 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.   

మరిన్ని వార్తలు