Ukraine Rejects Moscow Mariupol Ultimatum in War - Sakshi
Sakshi News home page

తగ్గేదేలే.. రష్యాకు ఎదురుదెబ్బలు.. ఉక్రెయిన్‌ కౌంటర్‌ మామూలుగా లేదు..

Published Mon, Mar 21 2022 6:22 PM

Ukraine Rejects Moscow Mariupol Ultimatum In War - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు తీవ్రతరమయ్యాయి. సామాన్య పౌరులే లక్ష్యంగా రష‍్యన్‌ దళాలు దాడులు చేస్తున్నాయి. కాగా, దాడుల్లో ఉక్రెయిన్​ పోర్టు నగరం మరియుపోల్​లోని బలగాలు ఆయుధాలు కిందపడేసి.. లొంగిపోవాలన్న రష్యా డిమాండ్​ను ఉక్రెయిన్​ తిరస్కరించింది. లొంగిపోయే ప్రసక్తే లేదని ఘాటుగా స్పందించింది.

అయితే, మరియుపోల్‌లో రష్యా బలగాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ సైన్యం ఆయుధాలు కింద పడేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాయి. ఈ క్రమంలో తమ దేశ బలగాలు లొంగిపోయే ప్రసక్తే లేదని ఉక్రెయిన్‌ ఉప ప్రధాని ఇరినా వెరెశ్​చక్ స్పష్టం చేశారు. రష్యా హెచ‍్చరికలను వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు. అంతకు ముందు రష్యా బలగాలు మరియుపోల్ నగరంలోని ఆర్ట్ స్కూల్​పై బాంబు దాడులు చేశాయి. ఈ దాడులు జరిగిన సమయంలో ఆ స్కూల్‌లో 400 మంది శరణార్థులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది.

మరోవైపు.. దాడుల్లో రష్యాకు మరో షాక్‌ తగిలింది. బ్లాక్​సీ ఫ్లీట్​కు చెందిన సీనియర్ నౌకాదళ కమాండర్ ఆండ్రీ పాలీ.. మరియుపోల్​లో ఉక్రెయిన్‌తో జరిగిన దాడుల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సేవస్టోపోల్ పోర్ట్ సిటీ గవర్నర్ మైఖేల్ రాజోజయేవ్ తెలిపారు. తాజాగా.. రష్యా బాంబు దాడుల్లో సుమీఖింపోరమ్‌ కెమికల్‌ ప్లాంట్‌ నుంచి అమ్మోనియా లీక్ అయింది. ప్లాంటుకు దాదాపు 5 కిలోమీటర్ల మేర అమ్మోనియా ప్రభావం ఉంటుందని సుమీ గవర్నర్‌ ఓబ్లాస్ట్‌ మిత్రో పేర్కొన్నారు. దీంతో కెమికల్‌ ప్లాంట్‌ సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మాస్కులు ధరించి శ్వాస తీసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement