Ukraine-Russia war: ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్‌ దాడి

11 Jul, 2022 05:11 IST|Sakshi
రాకెట్‌ దాడిలో నేలమట్టమైన నివాస భవనం

కీవ్‌: రష్యా శనివారం రాత్రి ఉక్రెయిన్‌పై జరిపిన రాకెట్‌ దాడిలో 15 మంది చనిపోయారు. రాకెట్‌ దాడితో డొనెట్‌స్క్‌ ప్రావిన్స్‌ చాసివ్‌ యార్‌ పట్టణంలోని అపార్టుమెంట్‌ కుప్పకూలింది. శిథిలాల కింద మరో 20 మంది చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు. దాడులకు రష్యా విరామం పాటిస్తుందని భావిస్తున్న క్రమంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జూన్‌ 21వ తేదీన క్రెమెన్‌చుక్‌లోని షాపింగ్‌ మాల్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 19 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే.

సైనిక సంబంధ లక్ష్యాలపైనే దాడులు చేపడుతున్నట్లు చెప్పుకుంటున్న రష్యా తాజా ఘటనపై ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా అనుకూల వేర్పాటు వాదుల ప్రాబల్యమున్న డోన్బాస్‌ ప్రాంతంలోని లుహాన్‌స్క్‌ ప్రావిన్సుపై పట్టు సాధించిన రష్యా బలగాలు మరో ప్రావిన్స్‌ డొనెట్‌స్క్‌లో పాగానే లక్ష్యంగా కదులుతున్నాయి. ఇలా ఉండగా, ఎటువంటి పోరాట నైపుణ్యం లేని ఉక్రెయిన్‌ పౌరులతో కూడిన మొదటి బృందం బ్రిటన్‌కు చేరుకుంది. మొత్తం 10 వేల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని యూకే తెలిపింది.
 

మరిన్ని వార్తలు