‘జాహ్నవిని ఉద్దేశించి నవ్వలేదు’ | Sakshi
Sakshi News home page

‘జాహ్నవిని ఉద్దేశించి నవ్వలేదు’.. అసలేం జరిగిందంటే..

Published Sat, Sep 16 2023 2:43 PM

US Cop Explained Why He Laughed At Jahnavi Kandula Accident  - Sakshi

సియాటెల్‌లో రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని జాహ్నవి (Jaahnavi Kandula) మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం.. తెలిసిందే. ఆ అధికారి తీరుపై ఎన్నారైలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. కఠిన చర్యలు తీసుకోవాలని భారత్‌ సైతం అమెరికాను డిమాండ్‌ చేస్తోంది. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని కించపరిచే ఉద్దేశంతో చేసినవి కావంటూ అధికారి డేనియల్‌ ఆర్డరర్‌ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది.  

ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతి చెందింది. అయితే.. సియాటెల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ గిల్డ్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేనియల్‌ అడెరెర్‌.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్‌ అయ్యింది.

‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్‌ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్‌ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్‌ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్‌ అడెరెర్‌ రాసిన లేఖను సియాటెల్‌ పోలీసు అధికారుల గిల్డ్‌ విడుదల చేసింది. న్యాయవాదులను ఉద్దేశిస్తూనే ఆ వ్యాఖ్యలు చేశాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వాను అంతే.. అని డేనియల్‌ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. 

‘‘జనవరి 23న పెట్రోలింగ్ వాహనం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేసేందుకు నేను వెళ్లాను. తిరిగి ఇంటికి వస్తుండగా తోటి అధికారికి ఫోన్‌ చేసి ఘటన గురించి చెప్పాను. అప్పటికి నా విధులు పూర్తయ్యాయి. అయితే బాడీక్యామ్‌ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం నాకు తెలియదు. నేను జరిపిన వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డ్‌ అయ్యింది. అయితే, ఇలాంటి కేసుల్లో కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే నేను మాట్లాడాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో చాలా సార్లు చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను’’ అని డేనియల్‌ తన లేఖలో వివరించారు.

అంతేగానీ.. బాధితురాలిని అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలియకపోతే.. ఇలాంటి భయానక ఊహాగానాలే వైరల్‌ అవుతాయని అన్నారు. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, ఉన్నతాధికారులు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని తెలిపారు.

ఈ వివాదంపై సియాటెల్‌ పోలీసు అధికారుల గిల్డ్‌, డేనియల్‌ అడెరెర్‌కు మద్దతుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘వైరల్‌ అయిన దృశ్యాలు బాడీక్యామ్‌ వీడియో రికార్డ్‌ చేసినవి. అయితే, ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయి. అవి ప్రజలకు తెలియవు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది’’ అంటూ డేనియల్‌కు మద్దతుగా గిల్డ్‌ వ్యాఖ్యానించింది.  మరోవైపు డేనియల్‌ అడెరెర్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని అమెరికాలో ఆన్‌లైన్‌ పిటిషన్లు మొదలయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement