ట్రంప్‌ చేసిన పనికి జో బైడెన్‌ క్షమాపణ

12 Nov, 2022 08:32 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన పనికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ క్షమాపణలు చెప్పారు. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన అంశంపై మాట్లాడుతూ ఈ మేరకు ప్రపంచ దేశాలను క్షమాపణలు కోరారు బైడెన్‌. పారిస్‌ ఒప్పందంలో వెంటనే చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రధాన పర్యావరణ సదస్సులను నిర్వహించామని తెలిపారు. భూతాపాన్ని తగ్గించే పోరాటంలో నాయకత్వాన్ని తిరిగి తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు బైడెన్‌. ఐక్యరాజ్య సమితి కాప్‌27 సదస్సులో ప్రసంగించారు.  

‘స్నేహితులారా.. ఈ ఒక్క సమస్యపై దశాబ్దాలుగా చర్చ కొనసాగుతోంది. పురోగతిలో అడ్డంకులను అధిగమించడానికి అమెరికా చేయవలసిన పరివర్తనాత్మక మార్పులు చేయాలని నిర్ణయించుకునే నేను అధ్యక్ష పదవికిలోకి వచ్చాను. అమెరికా ఒక విశ్వసనీయమైన, గ్లోబల్‌ లీడర్‌గా వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంది. దానిని సాధించటానికి మా సాయశక్తులా కృషి చేస్తాం.’ అని తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. 2030 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. 

ప్రపంచ దేశాలు సైతం శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు బైడెన్‌. వారిపై ఒత్తిడి తేవటం గ్లోబల్‌ లీడర్‌గా తమ బాధ్యత అని వెల్లడించారు. పర్యావరణ సంక్షోభంతో అది మానవ, ఆర్థిక, వాతవారణ, జాతీయ భద్రతకు ముప్పు తెస్తోందని సూచించారు. ఈ భూమండలంపై ఉన్న ప్రతి జీవికి ముప్పు వాటిల్లుతోందన్నారు.

ఇదీ చదవండి: పాలపుంతతో ప్రాణానికి నిశ్చింత

మరిన్ని వార్తలు